కమర్షియల్ గ్యాస్ సరఫరా షురూ..29 రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ఏజెన్సీలు

కమర్షియల్  గ్యాస్ సరఫరా షురూ..29 రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ఏజెన్సీలు
  • 29 రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ఏజెన్సీలు
  •     డొమెస్టిక్ గ్యాస్​కూ కొరత లేదన్న కేంద్రం
  •     అక్రమ నిల్వలపై దాడులు చేస్తున్న అధికారులు


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న వంటగ్యాస్ సరఫరా ఒత్తిడిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సుమారు 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కమర్షియల్ ఎల్‌‌‌‌పీజీ సిలిండర్ల పంపిణీని ఇప్పటికే పునరుద్ధరించినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న తరహా పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా ఈ సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వ్యాపార అవసరాలకు సరఫరాను పునరుద్ధరిస్తూనే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా గృహ వినియోగదారులకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుతం వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళన కారణంగా గ్యాస్ బుకింగ్‌‌‌‌లు భారీగా పెరిగాయి. సాధారణంగా రోజుకు 55 లక్షలుగా ఉండే బుకింగ్‌‌‌‌లు, ప్రస్తుతం 88 లక్షలకు చేరాయి. అయితే, దేశంలో తగినంత స్టాక్ ఉందని, వినియోగదారులు ఆందోళనతో ‘పానిక్ బుకింగ్’ చేయొద్దని ప్రభుత్వం పేర్కొంది.

దేశీయంగా ఉత్పత్తి పెంచిన సర్కారు..

గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు హార్మూజ్ జలసంధిలో రవాణా ఆంక్షల వల్ల దిగుమతులపై కొంత ప్రభావం పడినప్పటికీ, దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్రభుత్వం లోటును భర్తీ చేస్తోంది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని గత కొన్ని రోజుల్లోనే 31 శాతానికి పెంచడం విశేషం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని అధికారులు భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరతను సాకుగా చూపి అక్రమంగా నిల్వ చేసే వారిపై మరియు బ్లాక్ మార్కెట్ విక్రయదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఉత్తరప్రదేశ్‌‌‌‌లో దాదాపు 1,400 చోట్ల మెరుపు దాడులు నిర్వహించి 20 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కూడా ఆయిల్ కంపెనీలు, స్థానిక అధికారులు కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు.

మొబైల్ యాప్స్​తో బుకింగ్..

వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా డిజిటల్ విధానాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం కోరుతోంది. వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా మొబైల్ యాప్స్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని, సిలిండర్లు నేరుగా ఇంటికే డెలివరీ చేస్తామని చెప్పింది. అలాగే, వీలున్న చోట వాణిజ్య వినియోగదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్​జీ) కి మారాలని, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో హోటళ్లు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకానికి అనుమతిచ్చామని అధికారులు వివరించారు.