- సీఆర్పీఎఫ్ బెటాలియన్ తరలిపోయినా స్థలాన్ని వర్సిటీకి అప్పగించని పోలీసులు
- తాజాగా అందులోనే కాజీపేట ఏసీపీ ఆఫీస్ ఏర్పాటుతో మళ్లీ తెరమీదకు వివాదం
- క్యాంపస్ భవిష్యత్ అవసరాలు, డిపార్ట్మెంట్ల బిల్డింగులకు స్థలం లేకుండా చేస్తున్నారని విద్యార్థుల అభ్యంతరం
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ భూముల పంచాయితీకి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఇప్పటికే రూ.కోట్లు విలువ చేసే వర్సిటీ ల్యాండ్స్ అన్యాక్రాంతం కాగా, సీఆర్పీఎఫ్ బెటాలియన్ కు కేటాయించిన స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం వివాదాలకు కారణమవుతోంది. బెటాలియన్ తరలిపోయి నెలలు గడుస్తున్నా ఆ స్థలాన్ని పోలీసులు యూనివర్సిటీకి అప్పగించకపోవడం, రెండ్రోజుల కిందట అందులోనే ఏసీపీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడంతో మరోసారి చర్చకు దారితీసింది.
వర్సిటీ డిపార్ట్మెంట్లకు సొంత బిల్డింగ్ లు, ఇతర భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాల్సిన ల్యాండ్ ను పోలీసులు చేతుల్లోకి తీసుకోవడంపై స్టూడెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిరుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేయూ భూములు కేటాయిస్తే ఉద్యమించి అడ్డుకున్న స్టూడెంట్లు, ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్స్ పరిరక్షణ కోసం మరోసారి ఉద్యమానికి రెడీ అవుతున్నారు.
బెటాలియన్ కు ఇచ్చిన భూమిపై వివాదం
1976లో హనుమకొండ మండల పరిధిలోని పలివేల్పుల, కుమార్ పల్లి, లష్కర్ బజార్ శివారులోని సుమారు 673.12 ఎకరాల్లో కాకతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వర్సిటీకి చెందిన సుమారు 72 ఎకరాల భూమిని వివిధ డిపార్ట్మెంట్ల అవసరాల కోసం కేటాయించారు. రుద్రమాదేవి ఫిల్టర్ బెడ్ కోసం 13.14 ఎకరాలు, ఎస్సారెస్పీ కెనాల్ కు 45.1 ఎకరాలు, ఆలిండియా రేడియో స్టేషన్ కు 2 ఎకరాలు, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ కు ఒక ఎకరం, మున్సిపల్ పైపులైన్ కు 2.10 ఎకరాలు, కేయూ పోలీస్ స్టేషన్ కు 2 ఎకరాలు ఇచ్చారు. 1989లో యూనివర్సిటీ ల్యాండ్స్ లోనే సీఆర్పీఎఫ్ 58వ బెటాలియన్ ఏర్పాటు చేశారు. అప్పటి యూనివర్సిటీ అధికారులు టెంపరరీ అవసరాల కోసం దాదాపు పదెకరాల భూమిని బెటాలియన్ ఆఫీస్, సిబ్బంది క్వార్టర్స్ కోసం అప్పగించారు.
ఇదిలాఉంటే దాదాపు ఏడాదిన్నర కింద సీఆర్పీఎఫ్ బెటాలియన్ ను ఇక్కడి నుంచి మణిపూర్ కు తరలించారు. దీంతో ఆ 10 ఎకరాల స్థలం ఖాళీ కాగా, దాని చుట్టూ కేయూ పోలీసులు కంచె ఏర్పాటు చేసుకుని, సీజ్ చేసిన బండ్లు పెట్టడానికి వినియోగిస్తున్నారు. దీంతో అప్పట్లోనే వర్సిటీ స్టూడెంట్లు, ఆఫీసర్లు ఆ భూమిని తమకు అప్పగించాలని పోలీస్ ఆఫీసర్లను కోరారు. వారు ససేమిరా అనడంతో ఆ పదెకరాల భూమిపై వివాదం మొదలైంది. దీంతో విషయాన్ని యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇంతవరకూ సమస్యను సాల్వ్ చేయకపోవడంతో వివాదం కొనసాగుతూనే ఉంది.
పోలీస్ శాఖ ఆధీనంలోనే 12 ఎకరాలు..
కేయూ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మొదట రెండు ఎకరాల భూమి ఇచ్చారు. ఆ తర్వాత సీఆర్పీఎఫ్ బెటాలియన్ కు కేటాయించిన 10 ఎకరాల స్థలాన్నీ కూడా కేయూ పోలీసులే వినియోగించుకుంటున్నారు. దీంతో వర్సిటీకి చెందిన 12 ఎకరాల భూమి పోలీస్ శాఖ ఆధీనంలోనే ఉన్నట్లయ్యింది. కాగా, ఇప్పటికే బెటాలియన్ ల్యాండ్ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లగా, ఆ భూమి తిరిగి వర్సిటీకే దక్కుతుందని అంతా భావించారు. కానీ రెండ్రోజుల కింద బెటాలియన్ బిల్డింగులో కాజీపేట ఏసీపీ ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. అక్కడ హోంగార్డులు, కానిస్టేబుళ్లకు విధులు కేటాయించి, కాపలా పెట్టారు. దీంతో వర్సిటీ అవసరాలకు ఉపయోగపడాల్సిన భూమిని పోలీస్ డిపార్ట్మెంట్ వినియోగించడమేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న స్టూడెంట్లు
కేయూలో చాలా డిపార్ట్మెంట్లకు సొంత బిల్డింగులు లేవు. సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మహిళా ఇంజినీరింగ్ కాలేజీ ఎస్డీఎల్సీఈ బిల్డింగులోనే కొనసాగుతున్నాయి. వర్సిటీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టళ్లు కూడా నిర్మించాల్సి ఉంది. పీవీ నాలెడ్జ్ సెంటర్, కే-హబ్ లాంటి రీసెర్చ్ సెంటర్లు, వర్సిటీకి చెందిన ఇతర బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికీ భవిష్యత్లో భూమి అవసరం. కానీ వర్సిటీ భూములను ఇతర డిపార్ట్మెంట్లకు ఇవ్వడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఇదే బెటాలియన్ భూములు కేటాయిస్తూ ఈసీలో తీర్మానం చేయగా, అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు బెటాలియన్ కు ఇచ్చిన భూముల్లో ఏసీపీ ఆఫీస్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో వర్సిటీ భూములు కాపాడాలంటూ ఇటీవల ఏబీవీపీ ఆధ్వర్యంలో వీసీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికే రూ.కోట్లు విలువ చేసే వర్సిటీ భూములు అన్యాక్రాంతం కాగా, యూనివర్సిటీ భవిష్యత్ అవసరాల కోసం వాటిని రక్షించుకునేందుకు విద్యార్థులు మరోసారి ఉద్యమానికి రెడీ అవుతున్నారు. ఇదే విషయమై కేయూ డెవలప్మెంట్ ఆఫీసర్ వాసుదేవరెడ్డిని వివరణ కోరగా, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వర్సిటీ భూముల రక్షణకు ఉద్యమిస్తం..
గతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్ కోసం ఇచ్చిన భూమిని పోలీస్ శాఖ వాడుకుంటున్నది. ఆ భూమి న్యాయంగా యూనివర్సిటీకి దక్కాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఆ భూమి వర్సిటీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే వర్సిటీ భూముల రక్షణకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతాం.- మాచర్ల రాంబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
వర్సిటీకి తిరిగి అప్పగించాలి..
కేయూ భూములను ఇతర డిపార్ట్మెంట్లకు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో యూనివర్సిటీ అవసరాలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వెంటనే సీఆర్పీఎఫ్ బెటాలియన్ కు ఇచ్చిన భూములు తిరిగి యూనివర్సిటీకి అప్పగించాలి. ఆయా భూముల కబ్జాలు తేల్చడంతో పాటు చుట్టూ కాంపౌండ్ నిర్మించాలి. కేయూ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతాం.- ఆరెగంటి నాగరాజు, బీసీ విద్యార్థి జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్
