యూఎస్‌‌‌‌లో వీసా కోసం మోసం.. 11 మంది ఇండియన్స్పై కేసు

యూఎస్‌‌‌‌లో వీసా కోసం మోసం.. 11 మంది ఇండియన్స్పై కేసు
  • గ్రీన్ కార్డ్ కోసం దోపిడీకి గురైనట్టు నాటకం
  • ఎఫ్​బీఐ ఎంక్వైరీలో నిర్వాకం బట్టబయలు
  • నిందితులంతా గుజరాతీలే

మిస్సోరీ: అమెరికాలో వీసా పొందడం కోసం సాయుధుల చేతిలో దోపిడీకి గురైనట్టు నాటకమాడిన 11 మంది భారతీయులను అరెస్టు చేశారు. చట్టవిరుద్ధంగా అక్కడ నివసిస్తున్న వీరు ‘యూ’-వీసా కోసం తమపై తుపాకీ చూపించి దోపిడీ దారులు దాడిచేసినట్టు ఫేక్ కేసులు పెట్టారు. అయితే ఎఫ్​బీఐ ఎంక్వైరీ లో ఈ విషయమంతా బట్టబయలైంది. ఈ కేసులో అరెస్టు అయిన వారంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినోళ్లే కావడం గమనార్హం.

మార్చి 2023లో రంభాయ్ పటేల్ అనే వ్యక్తి నేతృత్వంలో మసాచుసెట్స్‌‌‌‌లో కనీసం ఆరు సాధారణ షాపులు, లిక్కర్ షాపులు, ఫాస్ట్‌‌‌‌ఫుడ్ రెస్టారెంట్లలో ఈ నాటకాలు జరిగాయి. ఒక వ్యక్తి దొంగగా నటించేవాడు. తుపాకీ చూపించి, కౌంటర్‌‌‌‌లోని డబ్బు తీసుకొని పారిపోయేవాడు. మొత్తం సీసీటీవీలో రికార్డవుతుంది. దొంగ పారిపోయిన 5 నిమిషాలు తర్వాత దుకాణంలో ఉన్న వాళ్లు పోలీసులకు ఫోన్ చేసేవారు. తాము హింసాత్మక దోపిడీ బాధితులమని చెప్పి ‘యూ-’ వీసాకు దరఖాస్తు చేసుకునేవారు. ‘యూ-’ వీసా అంటే హింసాత్మక నేరాల బాధితులకు అమెరికా ఇచ్చే ప్రత్యేక వీసా. ఇది వారు అక్కడ పని చేసే అనుమతి తోపాటు ఐదేండ్ల నుంచి పదేండ్లలో గ్రీన్ కార్డ్ అవకాశం కల్పిస్తుంది.

ఫేక్ ​కేసుల కోసం డబ్బులు వసూలు చేసి.. 

ఇలా వీసాలు ఇప్పించేందుకు రంభాయ్ పటేల్‌‌‌‌ పలువురి నుంచి డబ్బు వసూలు చేశాడు. ఆ డబ్బులో కొంత దుకాణదారులకు ఇచ్చేవాడు. దీనితో లింకు ఉన్న జితేంద్రకుమార్ పటేల్, మహేశ్‌‌‌‌కుమార్ పటేల్, సంజయ్‌‌‌‌కుమార్ పటేల్ సహా ఆరుగురిని మసాచుసెట్స్‌‌‌‌లో అరెస్టు చేసి, ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. రమేశ్‌‌‌‌ భాయ్ పటేల్, రోనక్‌‌‌‌కుమార్ పటేల్, సోనల్ పటేల్, మింకేశ్ పటేల్.. కెంటకీ, మిస్సోరీ, ఒహాయోలో అరెస్టయ్యారు. వీరిని బోస్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేరాలతో లింకున్న దీపికాబెన్ పటేల్‌‌‌‌ అనే మహిళను ఇప్పటికే భారత్‌‌‌‌కు డిపోర్ట్ చేశారు. అసలు సూత్రధారి రంభాయ్ పటేల్, దొంగగా నటించిన వ్యక్తి, మరో డ్రైవర్‌‌‌‌పై ఇప్పటికే కేసులు నమోదై శిక్ష కూడా పడింది.