పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే

పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే
  • కాకా జీవితమే అందుకు ఉదాహరణ
  • అంబేద్కర్ మేనేజ్ మెంట్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ డేలో వివేక్ వెంకటస్వామి

 

ముషీరాబాద్, వెలుగు: పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని అంబేద్కర్ కాలేజ్ ల చైర్మన్ వివేక్  వెంకటస్వామి అన్నారు. శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ మేనేజ్ మెంట్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ డే జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన వివేక్ మాట్లాడుతూ.. జీవితంలో టార్గెట్ పెట్టుకొని అందుకోసం శ్రమించాలని స్టూడెంట్స్కు సూచించారు.  నిరంతర తపన, శ్రమ, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పుడే విజయం సాధించగలమన్నారు. లక్ష్య సాధనలో ఎన్ని అవరోధాలు వచ్చినా అధైర్యపడకుండా కష్టపడి పనిచేయాలని, అందుకు తన తండ్రి, దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) జీవితమే ఉదాహరణ అని చెప్పారు. సమాజంలోని పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం గడ్డం వెంకటస్వామి పని చేశారని, ఎంతో మందికి మేలు చేశారని అన్నారు. కార్మిక నేతగా, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పేదల సంక్షేమం కోసమే తపించే వారని చెప్పారు. ప్రతి కుటుంబానికి రేషన్ ఇప్పించటంతో పాటు ప్రైవేట్ సంస్థలో పెన్షన్ అమలు చేయించారని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసమే తన తండ్రి వెంకటస్వామి అంబేద్కర్‌ విద్యాసంస్థలు స్థాపించి, పేద స్టూడెంట్లు చదువుకు దూరం కాకుండా తన వంతు ప్రయత్నం చేశారని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ గెలవటమనేది అలవాటు చేసుకోవాలని సూచించారు.

కాకా ఆశయం గొప్పది: ప్రొఫెసర్ నాగేశ్వర్రావు

కాకా ఆశయం గొప్పదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు అన్నారు. ఆయన జీవితంలో ఏ రోజు ఫెయిల్‌ కాలేదని గుర్తుచేశారు. హై లెవల్ గోల్ పెట్టుకొని అదే స్థాయిలో కష్టపడాలని స్టూడెంట్స్కు  ప్రొఫెసర్ నవీన్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో కళాశాల డీన్ విష్ణు ప్రియ, ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ గౌరీ కుసుమ, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శేఖర్ మఠ, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వసుంధర, స్కూల్‌  ప్రిన్సిపల్ విఠలాచారి, హెచ్ఆర్ పవన్ కుమార్, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కిరణ్, వైస్ ప్రిన్సిపల్ నాగరాజు, ప్రోగ్రాం కన్వీనర్ మహ్మద్ మాజిద్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.