- పార్టీ మెంబర్షిప్ డ్రైవ్‌కు అనూహ్య ఆదరణ
- టార్గెట్ కంటే రెట్టింపు సభ్యుల చేరిక
- పూర్తి లెక్కలొస్తే మెంబర్ల సంఖ్య 5 కోట్లు క్రాస్ అవుతుందన్న పార్టీ వైస్ ప్రెసిడెంట్ దుష్యంత్
దాదాపు 11 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతున్న బీజేపీ బలం మరింత పెరిగింది. దాదాపు నెలన్నరపాటు సాగిన మెంబర్షిప్ డ్రైవ్ సూపర్ సక్సెస్ అయిందని, డ్రైవ్ ముగిసిన మంగళవారం నాటికి పార్టీలోకి కొత్తగా 3.78 కోట్ల మంది చేరారని, అన్ని రాష్ట్రాల నుంచి కచ్చితమైన లెక్కలొస్తే ఆ సంఖ్య ఈజీగా 5కోట్లకు చేరుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మెంబర్షిప్ డ్రైవ్ కో కన్వీనర్ దుష్యంత్ కుమార్ గౌతమ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2015లోనే పార్టీ మెంబర్ల సంఖ్య11 కోట్లకు చేరిందని గుర్తుచేసిన ఆయన.. 2019 మెంబర్షిప్ డ్రైవ్‌లో కనీసం 20 శాతం కొత్తవాళ్లను అంటే 2.2 కోట్ల మందిని చేర్చుకోవాలని పార్టీ టార్గెట్ పెట్టుకుందని అయితే టార్గెట్ కంటే రెట్టింపు సంఖ్యలో సభ్యులు చేరడం బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని దుష్యంత్ అన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద ముఖర్జీ జయంతినాడు(జులై 6న) బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో, పార్టీ చీఫ్ అమిత్ షా తెలంగాణలో ఆ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. డ్రైవ్ చివరిరోజైన ఆగస్టు 20 నాటికి 3, 78, 67, 753 మంది కొత్తవాళ్లు బీజేపీలో చేరారని, అన్ని రాష్ట్రాల నుంచి పూర్తి లెక్కలు ఇంకా రావాల్సి ఉందని వివరించారు. 2015నాటి మెంబర్షిప్ డ్రైవ్‌పై విమర్శలొచ్చిన నేపథ్యంలో ఈసారి ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. పార్టీలో చేరేందుకు మిస్డ్ కాల్ ఇచ్చినవారి పేర్లు, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు పక్కాగా సేకరించారు. గతంలోలాగే ఈసారి కూడా మెజార్టీ చేరికలు మిస్డ్‌కాల్ ద్వారానే జరిగాయి. బీజేపీ వెబ్సైట్, మోడీ యాప్ ద్వారానూ ఈసారి చెప్పుకోదగ్గస్థాయిలో మెంబర్లు చేరారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా 65 లక్షల మంది కొత్త సభ్యుల చేరికతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. వెస్ట్‌బెంగాల్‌లో 36 లక్షలు, గుజరాత్లో 34 లక్షలు, ఢిల్లీలో 15 లక్షల మంది కొత్తగా కాషాయ కండువా కప్పుకున్నారు. మెంబర్షిప్ డ్రైవ్ ముగియడంతో ఇక సెప్టెంబర్‌లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని, డిసెంబర్ నాటికి నేషనల్ కౌన్సిల్ మెంబర్ల ఎన్నిక పూర్తవుతుందని దుష్యత్ తెలిపారు. మోడీ పాపులారిటీ, అమిత్ షా చాణక్యనీతికి ఆకర్షితులై కొత్తవాళ్లు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన చెప్పారు.

