హవాలా ద్వారా డబ్బును విదేశాలకు తరలిస్తున్నరు

 హవాలా ద్వారా డబ్బును విదేశాలకు తరలిస్తున్నరు

కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ శిబిరాన్ని వ్యతిరేకించే పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, అక్రమంగా సంపాదించిన డబ్బు ఉపయోగపడుతుందన్నారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి వీటిని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కమలదళానికి తగిన బుద్ధి చెప్పాలంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన పార్టీ విద్యార్థి విభాగం ర్యాలీలో పాల్గొన్న మమతా..బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తనతో సహా ఫిర్హాద్ హకీమ్ , అభిషేక్ బెనర్జీతో సహా సీనియర్ తృణమూల్ నాయకులపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

బీజేపీ అందరినీ దొంగలుగా ముద్ర వేస్తోందని మమతా మండిపడ్డారు. ఇటీవల ఫిర్హాద్ హకీమ్‌ను  కేంద్ర ఏజెన్సీలు పిలిపించినందున అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర మోడల్‌లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేందుకు బీజేపీకి వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. హవాలా ద్వారా బీజేపీ విదేశాల్లో డబ్బును దాచి పెడుతోందన్నారు.  బేటీ బచావో  బేటీ పఢావో గురించి  గొప్పలు చెప్పకుంటున్న కేంద్రం..బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా న్యాయం అంటూ ప్రశ్నించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తూ కోల్ కతాలో 48 గంటలపాటు ధర్నా నిర్వహిస్తామన్నారు.