- స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలకు చెల్లిస్తున్న మూల్యం ఇదేనా అని ప్రశ్న
ముంబై: భారత్‌లో ఎక్కడపడితే అక్కడ చెత్త పారేస్తూ, విదేశాలకు వెళ్తే మాత్రం అక్కడి నిబంధనలను కచ్చితంగా పాటించి కేవలం డస్ట్ బిన్లలోనే చెత్త వేసే ప్రజల ద్వంద్వ వైఖరిపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలకు చెల్లిస్తున్న మూల్యం ఇదేనా అని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ముంబైలోని కంజూర్ మార్గ్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్యం, దుర్వాసన, పౌరుల ఆరోగ్య సమస్యలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ జీఎస్ కులకర్ణి, జస్టిస్ ఆర్తి సాథేతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను విచ్చలవిడిగా పారేస్తున్న తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు తమ వంతు కృషి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. మన దేశంలో రోడ్డుపై ఎలాంటి మొహమాటం లేకుండా చెత్త పారేసేవారే, విదేశాలకు వెళ్లినప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించి కనీసం చాక్లెట్ పేపర్‌ను కూడా డస్ట్ బిన్‌లోనే వేస్తారని ఎత్తిచూపింది.
విదేశీ పర్యాటకులు చెత్తను చూసేలా చేయడం తగదు
ముంబైలోని సముద్ర తీరాలు, పబ్లిక్ రోడ్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్న తీరును ప్రస్తావిస్తూ.. మనం నిజంగా నాగరిక సమాజంలోనే జీవిస్తున్నామా ప్రశ్నించింది. రాజాబాయి టవర్, హైకోర్టు భవనం వంటి ప్రముఖ చారిత్రక కట్టడాల సమీపంలో మున్సిపల్ ట్రక్కులు చెత్తను సేకరించే తీరును ధర్మాసనం తప్పుబట్టింది. ఇక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులు రోడ్లపై పడి ఉన్న చెత్తను చూసేలా చేయడం తగదని పేర్కొంది.
వీధులను డంపింగ్ ప్రదేశాలుగా మార్చకుండా వార్డులవారీగా అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ తగిన చర్యలు తీసుకోకపోతే తామే స్వయంగా తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనిపై వారం రోజుల్లోగా తగిన కార్యాచరణ చేపట్టాలని మున్సిపల్ యంత్రాంగాన్ని ఆదేశించింది.
