యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు షురూ

యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు షురూ
  • యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు షురూ
  • స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొత్త గుడిలో ఉదయం స్వస్తివాచనం, రక్షాబంధనం, విశ్వక్సేన పూజలతో అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం అంకురారోపణ, మృత్సంగ్రహణం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదట ప్రధానాలయంలోని స్వయంభూ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో ఉన్న స్వయంభూ మూర్తి అనుమతి తీసుకుని అర్చకులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు షురూ చేశారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ప్రత్యేక పూజలతో ఉత్సవాల సందడి మొదలైంది. మొదటి రోజు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసి లక్ష్మీసమేత నారసింహుడికి రక్షాబంధనం గావించారు. గర్భగుడిలో ఉన్న స్వయంభూ లక్ష్మీనరసింహస్వామికి కంకణధారణ చేసి ముఖ మంటపంలోకి తీసుకొచ్చి ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేశారు. స్వామి అమ్మవార్లను వజ్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలు, పూలతో అలంకరిచారు. సాయంత్రం ప్రధానాలయంలో నిత్య ఆరాధనల తర్వాత మృత్సంగ్రహణం, అంకురార్పణ ఉత్సవాలు కన్నులపండువగా జరిపారు.

పట్టువస్త్రాలు సమర్పించిన పోచంపల్లి నేత కార్మికులు

పోచంపల్లికి చెందిన పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో పోచంపల్లి చేనేత కార్మికులు స్వామి అమ్మవార్లకు ‘పాన్ పటోలా ఇక్కత్’ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే సోలాపూర్ కు చెందిన చాట్ల ఉమా, కేశవ్ దంపతులు రూ.2 లక్షల విలువ చేసే పట్టువస్త్రాలు అందజేశారు. ఏడేళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోచంపల్లి చేనేత కార్మికులు చేనేత పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు.

రూ.22 లక్షల ఆభరణాల విరాళం

యాదగిరి నర్సన్నకు మంగళవారం ఓ భక్తురాలు రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు విరాళంగా సమర్పించారు. దశావతార హారం, లక్ష్మీదేవి హారం, ముత్యాలు, డైమండ్, పచ్చల హారాలను ప్రత్యేకంగా తయారు చేయించి దేవస్థానానికి అందజేశారు.

గుట్టకు చేరుకున్న నారసింహుడి అఖండజ్యోతి

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 18న హైదరాబాద్ బర్కత్ పురాలోని యాదగిరి భవన్ నుంచి బయలుదేరిన లక్ష్మీనారసింహుడి అఖండజ్యోతి యాత్ర మంగళవారం రాత్రి యాదగిరిగుట్టకు చేరుకుంది. యాదగిరిగుట్టలో అఖండజ్యోతి యాత్రకు యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండ్లపల్లి నుంచి వైకుంఠ ద్వారం వరకు బతుకమ్మ ఆట ఆడుతూ మహిళలు సంబరాలు చేసుకున్నారు. వైకుంఠ ద్వారం వద్ద లక్ష్మీనరసింహుల విగ్రహాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. రాత్రి 10 గంటలకు రాయగిరి చెరువులో స్వామిఅమ్మవార్ల విగ్రహాలను నిమజ్జనం చేశారు. అంతకుమందు అఖండజ్యోతి సాయంత్రం భువనగిరికి చేరుకున్న సందర్భంగా.. యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.