చాయ్‌‌‌‌తో దిమాక్​ హుషార్​…

చాయ్‌‌‌‌తో దిమాక్​ హుషార్​…

బయట ఫ్రెండు కలిసినా, ఇంటికెవరైనా వచ్చినా, బాగా అలసిపోయినా వెంటనే గుర్తొచ్చేది చాయ్‌‌‌‌. అప్పట్లో బ్రిటిషోళ్లు తీసుకొచ్చిన చాయ్‌‌‌‌ ఇప్పుడు దేశమంతా పాకిపోయింది. ప్రస్తుతం ప్రతి గల్లీకో చాయ్‌‌‌‌ దుకాణం ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతటి చరిత్ర ఉన్న చాయ్‌‌‌‌ గురించి సైంటిస్టులు కొత్త విషయం కనుగొన్నారు. రెగ్యులర్‌‌‌‌గా చాయ్‌‌‌‌ తాగేవాళ్ల బ్రెయిన్‌‌‌‌, తాగని వాళ్ల కన్నా షార్ప్‌‌‌‌గా పని చేస్తదని నేషనల్‌‌‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌ సైంటిస్టులు చెప్పారు. 60, అంతకంటే ఎక్కువ వయసున్న 36 మందిని సుమారు మూడేళ్ల పాటు పరీక్షించి ఈ విషయం కనుగొన్నారు.

తొలుత ఈ 36 మందికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేశారు. వాళ్ల బాడీ, మెదడు ఎలా పని చేస్తుందో తెలుసుకున్నారు. తర్వాత వాళ్లను గమనిస్తూ వచ్చారు. కనీసం నాలుగు సార్లు గ్రీన్‌‌‌‌ టీ గాని, ఊలుంగ్‌‌‌‌ టీ గాని, బ్లాక్‌‌‌‌ టీ గాని తాగిన వాళ్ల బ్రెయిన్‌‌‌‌, తాగని వాళ్ల కన్నా చాలా షార్ప్‌‌‌‌గా పని చేస్తుందని తెలుసుకున్నారు. వాళ్లకు జ్ఞాపకశక్తి కూడా బాగుంటుందని కనుగొన్నారు. గతంలోనూ చాయ్‌‌‌‌పై చాలానే సర్వేలొచ్చాయి. చాయ్‌‌‌‌ తాగే వాళ్లకు మూడ్‌‌‌‌ బాగుంటుందని, గుండె రోగాలు దరి చేరవని సర్వేలు చెప్పాయి.