
నియంతృత్వం తెచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నరు: కేజ్రీవాల్
వచ్చే ఏడాది మోదీకి 75 ఏండ్లు.. మోదీ తప్పుకుంటే మీ ప్రధాని ఎవరు?
మరో 20 ఏండ్లు ఢిల్లీలో ఆప్ సర్కారే
బీజేపీకి 220 సీట్లు దాటవని జోస్యం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ఒకే దేశం.. ఒకే లీడర్” అనే టార్గెట్‌తో దేశంలో నియంతృత్వాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందుకోసం బీజేపీలో పెద్ద లీడర్లను రాజకీయంగా అంతం చేస్తున్నారని.. ప్రతిపక్ష సీఎంలను, నేతలను కటకటాల వెనక్కి నెడుతున్నారని చెప్పారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఆప్ హెడ్ ఆఫీసులో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ విధానం ప్రకారం 75 ఏండ్లు దాటితే రిటైర్ మెంట్ తీసుకోవాలి.. వచ్చే ఏడాదితో మోదీకి 75 ఏండ్లు నిండుతాయని.. మరి తదుపరి లీడర్ ఎవరని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రధానిని చేయడం కోసమే ఇప్పుడు మోదీ ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. షా కు అడ్డులేకుండా ఎన్నికలయ్యాక నెలరోజుల్లో యూపీ సీఎం యోగిని పదవి నుంచి తప్పిస్తారని చెప్పారు.
అద్వానీ, రాజేలు రాజకీయంగా అంతం..
బీజేపీ మళ్లీ గెలిస్తే మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, స్టాలిన్, పినరయి, థాక్రే సహా ప్రతిపక్ష పార్టీల నేతలు జైలు పాలవుతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘‘ప్రధాని ‘వన్ నేషన్, వన్ లీడర్’ అనే మిషన్‌ను ప్రారంభించారు. దేశంలోని నాయకులందరినీ రాజకీయంగా అంతం చేయాలనుకుంటున్నరు” అని ఆరోపించారు. ‘అద్వానీ, జోషి, చౌహాన్, వసుంధర రాజే, ఖట్టర్, రమణ్ సింగ్‌ను ఇప్పటికే రాజకీయంగా ఫినిష్ చేశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను పదవి నుంచి తొలగిస్తరు’ అని అన్నారు.
నకిలీ కేసులు కనుకే రాజీనామా చేయలే
ఎన్నికల తర్వాత ఏర్పడే కేంద్ర ప్రభుత్వంలో ఆప్ భాగస్వామి అవుతుందని, ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా వస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ 220 నంచి 230 సీట్ల వరకే వస్తాయని.. ఆ పార్టీ అధికారంలోకి రాదన్నారు. తనకు సీఎం పదవి ముఖ్యం కాదని, కానీ నకిలీ కేసుతో రాజీనామా చేయించాలని కుట్ర పన్నినందుకే పదవి నుంచి దిగిపోలేదని చెప్పారు. ఆప్‌ను అణిచివేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే, మరో 20 ఏండ్ల దాకా ఢిల్లీలో ఆప్ సర్కారే ఉంటుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
హనుమాన్ గుడిలో పూజలు
కేజ్రీవాల్ శనివారం ఉదయం కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ మందిర్‌లో పూజలు చేశారు. ఆయన వెంట సునీత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నా రు. ‘హనుమాన్‌జీ ఆశీస్సులు, కోట్లాది ప్రజల ప్రార్థనలు, సుప్రీంకోర్టు న్యాయంతో మీ అందరి మధ్యకు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.