
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించబోతున్న ఈ శుభతరుణంలో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి.. ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా కృషి చేయాలని ఆయన కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించేలా చూడాలన్నారు.
శనివారం నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్ ముఖ్యనాయకులతో మంత్రి ఫోన్లో మాట్లాడి.. పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై వారికి పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రారంభమైన దగ్గరి నుంచి ముగిసే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈవీఎంలు పోలీంగ్ సెంటర్‌కు చేరిన తర్వాత.. ప్రతీ బూత్‌లో సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? గమనించాలన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలు గోడౌన్‌కు చేరుకునే వరకు అలసత్వం వహించొద్దన్నారు.
ఈ 48 గంటల పాటు అప్రమత్తంగా పనిచేసి దేశంలో రాబోయే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ప్రభుత్వంలో తెలంగాణ జెండాను రెపరెపలాడించాలని ఆయన సూచించారు. ‘‘మీరు ఈ రెండు రోజులు కష్టపడితే.. మేం మీకోసం 55 నెలల పాటు కష్టపడి పనిచేసి మీ బంగారు భవిష్యత్తుకు బాటలేస్తాం”అని మంత్రి హామీ ఇచ్చారు.
రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమిష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ ఆకాంక్షలను నెరవేరుస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైందని, దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి కోరారు.