మే 13న నాలుగో దశ పోలింగ్.. 10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు ఎన్నికలు

మే 13న నాలుగో దశ పోలింగ్.. 10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు ఎన్నికలు

న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికలకు నాలుగో దశ పోలింగ్  సోమవారం జరగనుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో నాలుగో విడతలో జరిగే ఎన్నికలకు శనివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25, తెలంగాణలో 17, ఉత్తర ప్రదేశ్​లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌‌లో 8, పశ్చిమ బెంగాల్ లో  8, బిహార్​లో 5, జార్ఖండ్​లో 4, ఒడిశాలో 4, జమ్మూకాశ్మీర్​లో 1 లోక్‌‌సభ స్థానాలకు పోలింగ్  జరగనుంది. 96 లోక్‌‌సభ స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు అత్యధికంగా 525 మంది పోటీపడుతున్నారు. ఆ తర్వాత ఏపీలో మొత్తం 25 సీట్లకు 454 మంది పోటీలో నిలిచారు.

 బిహార్​లో ఐదు పార్లమెంట్ స్థానాలకు 55 మంది, జమ్మూకాశ్మీర్​లో ఒక్క లోక్ సభ స్థానానికి 24,  జార్ఖండ్‌‌లో 4 స్థానాలకు 45, మధ్యప్రదేశ్‌‌లో 8 స్థానాలకు 74, మహారాష్ట్రలో 11 సీట్లకు 209 మంది, ఒడిశాలో 4 సీట్లకు 37, ఉత్తరప్రదేశ్‌‌లో 13 స్థానాలకు 130, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది సీట్లకు 75 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక ఏపీ, ఒడిశాలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లో 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్  జరగనుంది. ఇక్కడ మొత్తం 2,368 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీచేస్తున్నారు.