- ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఘటనలో సంచలన విషయాలు
ఫరీదాబాద్: ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాలు తయారుచేసేందుకు నిందితులు పిండి గిర్నీని ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
పిండి గిర్నీలో యూరియాను మెత్తగా రుబ్బి, ఆపై ఎలక్ట్రికల్ మెషీన్లతో రీఫైన్ చేయడం ద్వారా బాంబులకు కావాల్సిన కెమికల్‌ను తయారు చేశారు. ప్రధాన నిందుతుల్లో ఒకడైన టెర్రరిస్ట్ డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కు తెలిసిన ట్యాక్సీ డ్రైవర్ ఇంట్లో గుర్తించారు. డ్రైవర్ ఇంట్లో నుంచి పిండి గిర్నీ, గ్రైండర్‌తోపాటు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆటో డ్రైవర్ ఇంట్లోనే..
హర్యానాలోని ఫరీదాబాద్‌లో అద్దె గదిలో ఉన్న డాక్టర్ ముజమ్మిల్ తాము చేపట్టే బ్లాస్టింగ్ ఆపరేషన్‌కు కావాల్సిన యూరియా వంటి పదార్థాలు కొనుగోలు చేసి, ట్యాక్సీ డ్రైవర్ ఇంట్లో దాచిపెట్టినట్లు అధికారుల విచారణలో తెలిసింది. అక్కడ యూరియాను పొడి చేశాక అమ్మోనియం నైట్రేట్‌ను వేరు చేసి బాంబులు తయారుచేశారు.
ఇక్కడ తయారుచేసిన పేలుడు పదార్థాలను ఉపయోగించే రెడ్‌ఫోర్ట్ వద్ద బ్లాస్ట్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పేలుడుకు ఒక రోజు ముందు నిర్వహించిన సోదాల్లో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఇతర పేలుడు పదార్థాలు దొరికాయి. దాంతో నిందితులు తాము అనుకున్న తేదీ కంటే ముందుగానే నవంబర్ 10న బ్లాస్టింగ్ ప్లాన్ అమలు చేశారు.
సోదరి పెండ్లికి కట్నం సామాను అని చెప్పి..
ట్యాక్సీ డ్రైవర్‌ను విచారించగా.. నాలుగేండ్ల కింద చికిత్స కోసం తన కొడుకును అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లినప్పుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ పరిచయమయ్యాడని డ్రైవర్ తెలిపాడు. అనంతరం పిండి గిర్నీ, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ తన రూమ్‌కు తీసుకువచ్చి.. అవన్నీ అతడి సోదరి పెండ్లికి కట్నం కింద ఇవ్వబోయే సామాన్లని చెప్పాడు. ముందుగా తన రూమ్‌లో దాచి కొద్దిరోజులయ్యాక వాటిని ముజమ్మిల్ తీసుకెళ్లిపోయాడని వెల్లడించినట్లు సమాచారం.
