ఆన్ లైన్ లో ఆఫర్ల పేరుతో అడ్డంగా దోచేస్తున్నారు కేటుగాళ్లు. తక్కువ ధరకే ఫోన్లు అంటూ ఆన్ లైన్ లో డబ్బులు తీసుకుని..ఫోన్లకు బదులు వేరే వస్తువులను పంపిస్తూ మోసం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాజేంద్ర నగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ల్యాప్ టాప్ లు, మానిటర్లతో పాటు రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
తక్కువ ధరకు సమ్ సంగ్ స్మార్ట్ మొబైల్ ఫోన్లు అమ్ముతున్నామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు నిందితులను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (శంషాబాద్ జోన్) పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ఈ నిందితులు Samsung మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు ఇస్తామని చెప్పి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు తీసుకుని, ఫోన్ల బదులుగా పోస్టల్ పార్సెల్ ద్వారా స్పీకర్లు, టంబ్లర్లు వంటి వస్తువులు పంపిస్తూ మోసం చేస్తున్నారు. 2021 సంవత్సరం నుంచి ఈ విధంగా భారీ మొత్తంలో ప్రజలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల ఎస్. విజయ్ కుమార్, వై. శివ కుమార్ , మొద్దిన్ , శశికాంత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితురాలు మంజుల పరారీలో ఉంది.
►ALSO READ | కోటి రూపాయలు వాడే కొట్టేసి.. వాడే డ్రామా ఆడాడు : వీడిన కూకట్ పల్లి దోపిడీ మిస్టరీ
వీరి నుంచి రెండు మానిటర్లు, ఒక ల్యాప్ టాప్, రెండు సీపీయూలు, ఒక ప్రింటర్, హార్డ్ డిస్క్, నాలుగు మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు 30, టంబ్లర్లు 133, హర్బల్ ఉత్పత్తులు సుమారు 150 బాక్సులు, సిమ్ కార్డులు 51 రూ లక్షా 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఎస్. విజయ్ కుమార్ కర్ణాటకకు చెందినవాడు. లాక్‌డౌన్‌కు ముందు ఒక మొబైల్ ఫోన్ బుక్ చేసిన సమయంలో ఈ మోసం విధానాన్ని నేర్చుకుని, తరువాత ఇతరులతో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు సమాచారం. ప్రజలు ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
