ఒకే ఒక్కడు.. తన కళతో అందరిని ఏకం చేశాడు. ప్రభుత్వానికి కోట్ల ఆదాయం తెచ్చాడు. లక్షల మందికి ఉపాధి కల్పించాడు. మొత్తంగా అతని సంగీత కచేరీలు కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కావు అవి పూర్తిస్థాయి ఆర్థిక వనరులు అని నిరూపించాడు..తన మ్యూజికల్ షోల ద్వారా రూ. 947కోట్ల ఆదాయాన్ని సంపాదించిపెట్టాడు ప్రముఖ పంజాబ్ పాప్ సింగర్ దిల్జిత్ దోసాంజ్.
దిల్జిత్ దోసాంజ్ సంగీత ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన పంజాబీ కళాకారులలో ఒకరు. 40 ఏళ్ల దిల్జిత్ దోసాంజ్ దిల్-లుమినాటి పేరుతో భారత్ లో సంగీత కచేరీలు నిర్వహించాడు. సంగీతంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. భారత్ లో దిల్జిత్ షో ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడయ్యాయంటే ఎంత క్రేజ్ ఉందో చెప్పొచ్చు.
దిల్జిత్ దోసాంజ్ తన దిల్-లుమినాటి టూర్ తో భారతదేశంలో సంగీత కచేరీలు కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాలేదు.. అవి పూర్తిస్థాయి ఆర్థిక వనరులుగా మారాయి. భారత్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత భారీగా ఉందో ఎర్నెస్ట్ & యంగ్ ఆడిట్సంస్థ అధ్యయనంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎర్నెస్ట్ & యంగ్ ఆడిట్ సంస్థ అధ్యయనం ప్రకారం..దిల్‌జిత్ దోసాంజా 2024 లో దిల్-లుమినాటి టూర్ నిర్వహించారు. భారత పర్యటన, పన్నుల ద్వారా రూ.114 కోట్లతో సహా, ఏకంగా రూ.943 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 13 నగరాల్లో 14 షోలతో సాగిన ఈ పర్యటనకు 3.2 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఒక్క ఢిల్లీ కచేరీకే రికార్డు స్థాయిలో 55వేల మంది అభిమానులు తరలివచ్చారు.
దిల్జిత్ దోసాంజా అభిమానులు కేవలం మెట్రో నగరాల్లోనే కాలేదు.. దిల్జిత్ ప్రోగ్రామ్ లకు హాజరైన వారిలో 49 శాతం టైర్ 2, టైఱ్ 3 నగరాలనుంచి రాగా, సుమారు 38 శాతం మంది ఈ మ్యూజిక్ షోకు హాజరయ్యేందుకు ఇతర ప్రాంతాలను వచ్చారు. అంతేకాదుచాలామంది వారి టూర్ ను ఎక్కువ రోజులకు పొడిగించడంతో ఆతిథ్య నగరాల్లో పర్యాటకం, ఇతర ఆతిథ్యరంగాలకు మంచి ఆదాయం వచ్చింది.
టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ.221 కోట్లు రాగా, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా రూ.33 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే పరోక్ష ఖర్చుల నుంచే ఎక్కువ ఆదాయం వచ్చింది. మ్యూజిక్ షోలకు హాజరైన భిమానుల ప్రయాణం, వసతి, ఆహారం, షాపింగ్ ,ఇతర ఖర్చుల ద్వారా రూ.553 కోట్లు సమకూరినట్లు నివేదిక అంచనా వేసింది.
ఇక దిల్జిత్ దోసాంజా మ్యూజిక్ షోల ద్వారా మంచి ఉపాధి కూడా లభించింది. లాజిస్టిక్స్, సెక్యూరిటీ, నిర్మాణం, హెల్పింగ్ సర్వీస్ వంటి రంగాలలో దాదాపు 1.2 లక్షల పనిదినాలు కల్పించింది. ఇది పెద్ద పెద్ద మ్యూజిక్ షోలు స్థానికంగా ఆదాయం, ఉపాధి ఏవిధంగా పెంచుతుందో ఈ పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి.
ఈ రిపోర్టుపై స్పందించిన దిల్జిత్ దోసాంజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ నివేదిక వేదికకు ఆవల ఉన్న కథను చెబుతోంది ,మేం మద్దతిచ్చిన జీవనోపాధులు, మేం ప్రోత్సహించిన పర్యాటకం, మేం ఉత్తేజపరిచిన వ్యాపారాలు ,మేం రగిలించిన నమ్మకం.. భారతదేశంలో సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, అది స్ఫూర్తినిచ్చే,అభివృద్ది చేసే, అందరిని ఏకం చేసే ఒక శక్తి అని అన్నారు.
దిల్-లుమినాటి టూర్ భారత్‌కే పరిమితం కాలేదు. ఇది 2024 వరకు అమెరికా, కెనడా, యూరప్ ,మధ్యప్రాచ్య దేశాలలో ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 137 మిలియన్ల డాలర్లు అంటే 943 కోట్ల ప్రత్యక్ష ఆదాయాన్ని ఆర్జించింది. భారత్ లో ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, పూణే, కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్, చండీగఢ్ ,గౌహతి వంటి నగరాలు హౌస్‌ఫుల్ షోలకు ఆతిథ్యం ఇచ్చాయి. ఇది దేశంలో లైవ్ మ్యూజిక్ కు పెరుగుతున్న ఆదరణ, ప్రభావాన్ని మరింత బలపరిచింది.
