కొల్లాపూర్, వెలుగు : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని రాజా బంగ్లా వద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు, బీజేపీ నాయకులు ఎల్లేని సుధాకర్‌రావు, పగడాల శ్రీనివాసులు హాజరయ్యారు.
ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ... మత్స్యకారులు చేపలు పట్టుకొని అమ్ముకునేందుకు వీలుగా కొల్లాపూర్ ప్రాంతంలో ఓ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలివి వలలతో మత్స్యకారులకు నష్టం జరుగుతోందని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ... తెనుగు జాతి చైతన్యమవ్వాలని సూచించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు అడగడం కాదు.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మన శాతం మనకు వచ్చేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తాము మద్దతిస్తామని, తెనుగు సామాజిక వర్గాన్ని ‘ఎ’ గ్రూప్‌లో చేర్చేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి నీలం మధు మాట్లాడుతూముదిరాజ్‌లు రాజకీయ, విద్య, ఉద్యోగరంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెనుగు సంఘం నాయకులు వెంకటస్వామి పాల్గొన్నారు.
