- ప్రమోషన్, డెవలప్మెంట్, మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ ఒకే దగ్గర
- ఎయిర్ పోర్ట్‌లో స్పెషల్ క్యూ.. 24/7 హెల్ప్ డెస్క్
- సర్టిఫైడ్ ఏజెన్సీలకే ఎం ప్యానెల్మెంట్
- పేషెంట్ల అటెండెంట్ల కోసం స్పెషల్ టూరిజం ప్యాకేజీలు
- గైడ్‌లైన్స్ రూపొందించాలని మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. హైదరాబాద్ ను గ్లోబల్ హెల్త్ డెస్టినేషన్ గా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా హెల్త్, టూరిజం డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేయనుంది.
ఇందులో భాగంగా మెడికల్ టూరిజానికి సంబంధించిన ప్రమోషన్, డెవలప్ మెంట్, మేనేజ్ మెంట్ వ్యవహారాలన్నీ చూసుకునేందుకు స్పెషల్ గా సింగిల్ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హెల్త్, టూరిజం డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఈ సొసైటీ నడవనుంది.
ఈ మేరకు తక్షణమే గైడ్‌లైన్స్ రూపొందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఇటీవలే మెడికల్ టూరిజం డెవలప్మెంట్ పై మినిస్టర్ దామోదర రాజనర్సింహ హెల్త్ అండ్ టూరిజం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలోనే అధికారులు అన్ని సేవలు ఒకే దగ్గర అంటుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే మెడికల్ టూరిజానికి హైదరాబాద్ హబ్ గా ఉంది. అయితే, సరైన పాలసీ లేకపోవడం, సమన్వయలోపం వల్ల పూర్తి స్థాయి ఆదాయం రావడం లేదు.
దీనిని దృష్టిలో పెట్టుకొని అటు వైద్య రంగాన్ని, ఇటు పర్యాటక రంగాన్ని అనుసంధానించడం ద్వారా రాష్ట్రానికి ఆదాయంతో పాటు గుర్తింపు తెచ్చేలా ప్రభుత్వం ఈ కొత్త గైడ్ లైన్స్ రూపొందిస్తున్నది.
ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్లకు ఈజీగా అప్రూవల్స్..
హైదరాబాద్‌కు ఎక్కువగా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్స్ కోసం విదేశీయులు వస్తున్నారు. అయితే, అనుమతుల ప్రక్రియలో జాప్యం వల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం కలుగుతున్నది. దీనికి చెక్ పెట్టేందకు సింప్లిఫైడ్ అప్రూవల్స్ విధానాన్ని తీసుకురానున్నారు.
క్రిటికల్ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో అనుమతులు ఇవ్వనున్నారు. అదే సమయంలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎథికల్ గైడ్‌లైన్స్ ను కచ్చితంగా అమలు చేయనున్నారు. నెల రోజుల్లోగా ట్రాన్స్‌ప్లాంట్ల డేటాపై నివేదిక ఇవ్వాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.
అలాగే, డబ్బు కోసం విదేశీయులను మోసం చేసే దళారుల బెడద లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. క్వాలిటీ, ట్రాన్స్ఫరెన్సీ పాటించే హాస్పిటల్స్, సర్వీస్ ప్రొవైడర్లను మాత్రమే నోడల్ ఏజెన్సీ ఎంప్యానెల్ చేస్తుంది. ప్రభుత్వం సర్టిఫై చేసిన సంస్థల ద్వారా వచ్చే వారికే ప్రాధాన్యం ఇస్తారు. దీనివల్ల పేషెంట్లకు భరోసా కలగడమే కాకుండా.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది.
ఎయిర్ పోర్ట్‌లో దిగగానే..
ట్రీట్‌మెంట్ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగే విదేశీయులకు భాష సమస్య రాకుండా.. వారు క్యూ లైన్లలో నిలబడకుండా ఎయిర్ పోర్టు అధికారులతో కలిసి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. మెడికల్ వాల్యూ ట్రావెల్ పేషెంట్ల కోసం ఇమ్మిగ్రేషన్ వద్ద సాధారణ ప్రయాణికులతో సంబంధం లేకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయనున్నారు.
ఏ సమయంలో వచ్చినా వారికి సాయం చేసేందుకు స్పెషల్ డెస్క్ 24 గంటలూ అందుబాటులో ఉండనుంది. అలాగే, ఎయిర్ పోర్ట్ అంతటా వారి భాషలోనే సమాచారం తెలిసేలా మల్టీ లింగ్వల్ సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
మెడికల్ టూరిజంపై ప్రచారం
ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో మెడికల్ ఖర్చులు చాలా తక్కువ. దీంతో వివిధ దేశాల నుంచి మన దగ్గరికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో విదేశీ పేషెంట్ల ఫుట్ ఫాల్ ను పెంచుకోవడానికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.
ఇందుకోసం ప్రధానంగా ఎయిర్ పోర్టుల్లో ఇక్కడ అందుతున్న వైద్య సదుపాయాలను ప్రచారం చేయనున్నారు. అలాగే, మెడికల్ కాంక్లేవ్ లు నిర్వహించి మన దగ్గర ఉన్న వైద్య సదుపాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురానున్నారు.
సింగిల్ విండో పోర్టల్.. వన్ స్టాప్ సొల్యూషన్..
వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్:
హాస్పిటల్స్, స్పెషలిస్ట్ డాక్టర్లు, ట్రీట్‌మెంట్ ఖర్చులు, ఫెసిలిటేటర్ల వివరాలన్నీ వెరిఫై చేశాకే పోర్టల్ లో పెడతారు.
పేషెంట్ ఫీడ్ బ్యాక్:
గతంలో చికిత్స పొందిన విదేశీయుల ఫీడ్ బ్యాక్ కూడా ఇందులో ఉంటుంది.
దీనివల్ల కొత్తగా వచ్చే వారికి మన వైద్యంపై నమ్మకం కలుగుతుంది.
లాజిస్టిక్స్ అండ్ ఇన్సూరెన్స్:
ఎయిర్ పోర్ట్ పికప్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్, బస చేయడానికి హోటల్స్, అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల లింకులన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి.
గ్రీవెన్స్ సెల్:
పేషెంట్లకు ఇబ్బంది కలిగితే ఫిర్యాదు చేసే ఆప్షన్ కూడా ఉండనుంది.
వెల్నెస్ టూరిజం డెవలప్మెంట్పై ఫోకస్
మెడికల్ టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. పేషెంట్ కోలుకునే సమయంలో వారితో వచ్చిన అటెండెంట్ల కు బోర్ కొట్టకుండా టూరిస్టు ప్లేసులను చూసేలా స్పెషల్ ప్యాకేజీలు డిజైన్ చేస్తున్నాం. ట్రీట్‌మెంట్ తర్వాత డాక్టర్ల సూచన మేరకు పేషెంట్లు టూరిస్ట్ ప్లేసులు సందర్శించేలా ‘వెల్ నెస్ టూరిజాన్ని డెవలప్ చేస్తాం. సిటీకి దగ్గర్లో వెల్నెస్ టూరిజానికి తగ్గట్టుగా తీర్చిదిద్దబోతున్నాం.
- వల్లూరు క్రాంతి, టూరిజం ఎండీ
