మీరు ఇన్సూరెన్స్ ఏజెంటా..? అయితే ఈ బ్యాడ్‌న్యూస్ మీకే..

మీరు ఇన్సూరెన్స్ ఏజెంటా..? అయితే ఈ బ్యాడ్‌న్యూస్ మీకే..

దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్నుల సవరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై పన్ను రేటును సున్నాకు తగ్గించిన సంగతి తెలిసిందే. గతంలో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై 18 శాతం జీఎస్టీ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.  చాలా కాలంగా కంపెనీలు జీఎస్టీ రేటును 12 శాతానికి తగ్గించాలని కోరగా చివరికి దానిని పూర్తిగా ఎత్తేసింది మోడీ సర్కార్. దీనికి కారణం ప్రజలందరికీ ఇన్సూరెన్స్ చేరువ చేయటమే. 

అయితే ఇన్సూరెన్స్ రంగంలోని కంపెనీలు తాము చెల్లించే జీఎస్టీ టాక్స్ క్రెడిట్ తిరిగి పొందటం తాజా చర్య వల్ల అస్సలు కుదరదు. అందుకే కంపెనీలు తెలివిగా ఆ భారాన్ని ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ట్రాన్స్ఫర్ చేసి వారికి ఇచ్చే ప్రోత్సాహకాల్లో కత్తింపులకు దిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించే కమిషన్లకు జీఎస్టీ భారాన్ని బదిలీ చేశాయి. దీని కారణంగా వారు గతంలో పొందిన కమిషన్ కంటే ఇప్పుడు తక్కువ ఆదాయాన్ని అందుకుంటున్నారు. 

అయితే ఈ గేమ్ ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలు, వారు చెల్లించే ఏజెంట్ కమిషన్లపై ఫోకస్ పెడుతోంది. దీనిలో భాగంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDAIకి కీలక ప్రతిపాదనలు పంపించింది. వాటిలో ముఖ్యమైనవి ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఏజెంట్లకు చెల్లించే కమిషన్‌ను గరిష్టంగా 20 శాతానికి పరిమితం చేయటం. ఇదే గనుక జరిగితే ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఇప్పటికే తగ్గిన ఆదాయంతో మరో భారాన్ని చూడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ చర్యలు కంపెనీల ఖర్చులను అదుపులో ఉంచి వినియోగదారులకు నిజంగా బెనిఫిట్ అవుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.