గ్రూపులు కట్టడం నా రక్తంలో లేదు.. ఐదేళ్లు ఆయనే సీఎం

గ్రూపులు కట్టడం నా రక్తంలో లేదు.. ఐదేళ్లు ఆయనే సీఎం

బెంగళూర్: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఐదేండ్లు పూర్తిగా పనిచేస్తారని, అందుకు తామంతా సహకరిస్తామన్నా రు. తామిద్దరం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తామన్నారు. 'అందరికీ మంత్రిపదవి అవకాశం రావాలని సీఎం యోచిస్తున్నారు. అందుకే క్యాబినెట్లో మార్పులు చేయాలను కుంటున్నారు. ఈక్రమంలోనే పార్టీ ఎమ్మెల్యే లు ఢిల్లీకి వచ్చారు' అని తెలిపారు.

కర్ణాటకలోని 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నా ఎమ్మెల్యేలే. గ్రూపులు కట్టడం  నా రక్తంలోనే లేదు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తిగా పాలిస్తారు.. మేము ఆయనతో కలిసి పనిచేస్తాం. నేను మరియు సిద్దరామయ్య ఇద్దరం హైకమాండ్‌కు కట్టుబడి ఉంటాము అని - కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాతో చెప్పారు. 

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలో వెంటనే పవర్ షేరింగ్ (అధికార పంపిణీ) ఒప్పందాన్ని అమలు చేయాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు కోరారు. ఈ మేరకు డీకే శివకుమార్ ను సపోర్ట్ చేస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు నవంబర్ 20న ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వెళ్లిన వారిలో దినేశ్ గూళిగౌడ, రవి గణిగ, గుబ్బి వాసులతో పాటు పలువురు ఉన్నారు. ఇదే అంశంపై అనేకల్ శివన్న, నెలమంగళ శ్రీనివాస్, ఇక్బాల్ హుస్సేన్, కునిగల్ రంగనాథ్, శివగంగా బసవరాజు, బాలకృష్ణలు కూడా  ఢిల్లీకి వెళ్లారు. 

 2023 మే 20న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల  తర్వాత సీఎం ఎవరనే దానిపై సిద్దరామయ్య, శివకుమార్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడితే.. రెండున్నరేండ్ల తర్వాత అధికారం ఇస్తామని హైకమాండ్ దగ్గర ఒప్పందం జరిగినట్లు అప్పట్లో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే, పార్టీ మాత్రం ఈ ఒప్పందాన్ని ఎప్పుడూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ క్రమంలో డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఐదేండ్లు సిద్ధరామయ్యనే సీఎం అని చెప్పారు.