- మరికొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకూ జారీ
- తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిన కంపెనీలు
హైదరాబాద్, వెలుగు: స్వర్గసీమ కన్ స్ట్రక్షన్ వారి అమేయ ప్రాజెక్టు సంస్థకు శనివారం రెరా చైర్మన్ సత్యనారాయణ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ సంస్థ ఇచ్చిన ప్రకటనలో అక్షరాల సైజు, ప్రాజెక్టు పూర్తిపేరు, లేఅవుట్ గా రిజిస్టర్ చేసి, ప్రకటన మాత్రం పూర్తి రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా చూపిస్తూ కొనుగోలుదారులను తప్పు దోవ పట్టించడం లాంటి ఉల్లంఘనలను గమనించిన నేపథ్యంలో షోకాజ్ నోటీసు జారీ చేసింది.
అమేయ సంస్థతో పాటు గోద్రెజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్టు, వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టు, తిరుమల హిల్స్ తదితర రియల్ ఎస్టేట్ కన్ స్ట్రక్షన్ కంపెనీలకూ షోకాజ్ నోటీసులు జారీ చేశామని రెరా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని కన్ స్ట్రక్షన్ కంపెనీలు రెరా రిజిస్ట్రేషన్ నంబరును పొందుపరిచినప్పటికీ, ఆ ప్రకటన రెరా నిబంధనలకు వ్యతిరేకంగా అథారిటీ గుర్తించిందన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్రకటనల్లో రెరా రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలని రెరా కమిషనర్ సత్యనారాయణ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రెరా రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా కొనుగోలుదారులను మోసం చేయడానికి ముందస్తు ప్రకటనలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రెరా చట్టం ప్రకారం 500 చదరపు మీటర్లు దాటితే, 8 కంటే ఎక్కువ యూనిట్లు కలిగి ఉన్న ప్రతి ప్రాజెక్టును ముందుగా రెరాలో రిజిస్టర్ చేయాలని, రెరా అథారిటీ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి, రిజిస్ట్రేషన్ నంబరును మంజూరు చేసిన తర్వాతే ఆ నంబరు ద్వారా అమ్మకాలపై ప్రకటనలు చేయాలని డెవలపర్లు, ఏజెంట్లను ఆయన ఆదేశించారు.
