విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ఎర..జగిత్యాలకు చెందిన పలువురు సైబర్‌‌‌‌ నేరగాళ్ల వలలో..

విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ఎర..జగిత్యాలకు చెందిన పలువురు సైబర్‌‌‌‌ నేరగాళ్ల వలలో..
  • డేటా ఎంట్రీ అని చెప్పి సైబర్ క్రైమ్స్ చేయిస్తున్న వైనం 
  • చైనా ముఠాలకు నిరుద్యోగులను అమ్మేస్తున్న ఏజెంట్లు
  • ఇటీవల లావోస్‌‌కు నిరుద్యోగులను తరలించిన గ్యాంగ్ అరెస్ట్‌‌ 

జగిత్యాలకు చెందిన నిరుద్యోగ యువతను విదేశాల్లో ఉద్యోగాల పేరిట 2024లో లావోస్‌‌కు తరలించారు. అక్కడికి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.75వేల నుంచి రూ.1లక్షకు పైగా వసూల్ చేశారు. టూరిస్ట్ వీసాపై అక్కడికి తీసుకెళ్లి పాస్‌‌పోర్ట్‌‌లు గుంజుకున్నారు. అక్కడి నుంచి థాయ్‌‌లాండ్‌‌కు, గోల్డెన్‌‌ ట్రయాంగిల్ ప్రాంతానికి తరలించి సైబర్ కాల్‌‌ సెంటర్‌‌‌‌లో చేర్పించి ఆన్‌‌లైన్‌‌ మోసాలు చేయించేవారు. జగిత్యాలకు చెందిన ఓ యువకుడు అక్కడి నుంచి తప్పించుకొని ఇండియాకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదు రోజుల కింద నిందితులు విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామ్‌‌రావు రాజశేఖర్‌‌లను అదుపులోకి తీసుకున్నారు. 

జగిత్యాల, వెలుగు: విదేశాల్లో ఉద్యోగం పేరిట జగిత్యాల నిరుద్యోగ యువతను సైబర్‌‌‌‌ నేరగాళ్లు ఆన్‌‌లైన్‌‌ మోసం ఉచ్చులోకి దింపుతున్నారు. నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ మ్యాన్‌‌పవర్ కన్సల్టెన్సీలు భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. యూరప్, థాయ్‌‌లాండ్‌‌, లావోస్ వంటి దేశాల్లో రూ.లక్షల జీతం వస్తుందని, నమ్మబలికి విదేశాలకు పంపి ఆతర్వాత, వారిని చైనా సైబర్ మోసాల వలలోకి నెడుతున్నారు.

కోటి ఆశలతో వెళ్లిన యువకులు అక్కడ ఆన్‌‌లైన్ మోసాలు బలవంతంగా చేయాల్సి వస్తోంది. తప్పించుకునే మార్గం లేక, తిరిగి స్వదేశానికి రావడానికి అవకాశం లేక అనేక కష్టాలు పడుతున్న బాధితుల గాథలు కలవరపెడుతున్నాయి. ఐదురోజులుగా సైబర్‌‌‌‌ ఫ్రాడ్స్‌‌ గ్యాంగ్‌‌ను జగిత్యాల పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. 

ఫేక్ కన్సల్టెన్సీలతోనే సమస్య

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఉపాధి కోసం యువత పెద్దసంఖ్యలో గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. వీరంతా గల్ఫ్ వెళ్లేందుకు ఏజెంట్లుగా చలామణి అవుతున్న వ్యక్తులను ఆశ్రయిస్తుంటారు. ఈ ఏజెంట్లు మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలతో కలిసి కమీషన్ల కక్కుర్తితో ఎలాంటి అనుమతులు లేకున్నా ఇంటర్వ్యూ నిర్వహించి నకిలీ వీసాలతో గల్ఫ్‌‌కి పంపిస్తున్నారు. మరికొందరికి ఇక్కడ చెప్పే ఉద్యోగానికి తీరా అక్కడి వెళ్లాక చేయించే పనికి సంబంధం లేకపోవడంతో రూ.లక్షలు ముట్టజెప్పి మరీ మోసానికి గురవుతున్నారు.

గల్ఫ్ వెళ్తున్న వారిలో ఎక్కువ శాతం పెద్దగా చదువులు లేనివారే కావడంతో ఇలాంటి ఏజెంట్లు, నకిలీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీల వలలో ఈజీగా పడుతున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విదేశీ వ్యవహారాల శాఖ అనుమతులు పొందిన ఏజెంట్లు కేవలం 31మందే ఉన్నారని అధికార లెక్కలు చెబుతుండగా  దాదాపు 120కి పైగా నకిలీ కన్సల్టెన్సీలు నడుస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 

యూరప్ దేశాల పేరుతో మోసాలు

ఒకప్పుడు గల్ఫ్ దేశాలకే పరిమితమైన ఇలాంటి మోసాలు.. ఇప్పుడు యూరప్ దేశాలకు సైతం విస్తరించాయి. యూరప్ వంటి దేశాల్లో ఉద్యోగాలున్నాయని చెబుతూ ఉన్నత చదువులు బీటెక్‌‌, ఎంటెక్‌‌, ఎంఎస్సీ చేసిన యువత సైతం ఈజీగా మోసపోతున్నారు. ఉన్నత ఉద్యోగాలు చెబుతూ అక్కడికి వెళ్లాక డేటా ఎంట్రీలు, పెట్రోల్ బంక్‌‌ల్లో, ఇతర సైబర్‌‌‌‌ మోసాల ఉచ్చులోకి నెడుతున్నారు. మరికొందరిని నేరుగా యూరప్‌‌కు పంపకుండా బ్యాంకాక్, థాయిలాండ్, మలేషియా, అర్మేనియా వంటి దేశాలకు పంపి అక్కడే చేతులు దులుపుకుంటున్నారు. వీరిని అక్కడికి చేర్చిన వెంటనే పాస్‌‌పోర్ట్‌‌లు లాక్కొని సైబర్ క్రైమ్ ముఠాలకు అమ్మేస్తున్నారు. ఇలాగే మోసపోయిన వారిలో కొందరు ఎలాగోలా తప్పించుకుని స్వదేశానికి వస్తుండగా సైబర్ ముఠాల వలలో చిక్కుకొని స్వదేశం రాలేక ఇబ్బంది పడుతున్న వారందరో ఉన్నట్లు తెలుస్తుంది.