భారత్, అమెరికా ట్రేడ్ డీల్ మీటింగ్ వాయిదా

భారత్, అమెరికా ట్రేడ్ డీల్  మీటింగ్ వాయిదా
  • ట్రంప్ టారిఫ్​లపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇరుదేశాల నిర్ణయం


న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్ విధించిన టారిఫ్​లను​రద్దుచేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. భారత్, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై అధికారిక సమావేశాన్ని రీ షెడ్యూల్ చేయాలని రెండు దేశాలు నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి దశ వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు దిద్దడానికి రెండు దేశాల చీఫ్ ట్రేడ్ నెగోషియేటర్ల నేతృత్వంలోని టీంలు వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు సమావేశం జరపాల్సి ఉంది. ఈ క్రమంలో అమెరికా సుప్రీంకోర్టు అమెరికా​సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడంతో ట్రంప్ టారిఫ్ పాలసీలపై గందరగోళం ఏర్పడింది. దీంతో రెండు దేశాలు ఈ ఒప్పందం మీద ప్రభావాన్ని అంచనా వేయడానికి సమయం కావాలని నిర్ణయించాయి. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసిన తర్వాత.. ఇరు దేశాలకు అనుకూలమైన కొత్త తేదీలలో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని అమెరికా తెలిపింది. శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు  ట్రంప్ విధించిన సుంకాలను కొట్టివేసింది. ట్రంప్​ ప్రభుత్వం రాజ్యాంగ అధికారాన్ని అతిక్రమించిందని కోర్టు తీర్పునిచ్చింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను​విధించిన సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన మరుసటి రోజే (శనివారం).. ప్రపంచ దేశాలపై సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు.

ట్రేడ్​ డీల్​ను ‘కోల్డ్ స్టోరేజ్’లో పెట్టాలి: కాంగ్రెస్ 

అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని​కుదుర్చుకున్న కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శిలు గుప్పించింది. ఈ ఒప్పందం ‘అబ్ కీ బార్ ట్రంప్ సే హార్’కు నిదర్శనమని ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలపై ట్రంప్​ విధించిన టారిఫ్‌‌‌‌‌‌‌‌లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందాన్ని ‘కోల్డ్ స్టోరేజ్’లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.