న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ (ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అనంతరం ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల సంఖ్య 1.70 కోట్లకు పైగా తగ్గింది. ఈ మేరకు పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, గోవా, కేరళ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు శనివారం తుది ఓటరు జాబితాను ప్రకటించారు.
ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలలో గత సంవత్సరం అక్టోబర్ 27న సర్ ప్రక్రియను ప్రారంభించారు. ఆ సమయంలో మొత్తం ఓటర్ల సంఖ్య 21.45 కోట్లకు పైగా ఉంది. తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత ఆ సంఖ్య 19.75 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 60 కోట్ల మంది ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. మిగిలిన 40 కోట్ల మంది ఓటర్లను 17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలలో కవర్ చేస్తారు. అసోంలో ప్రత్యేక సవరణ ఈ నెల 10న పూర్తయింది. వివిధ కారణాల వల్ల ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో సర్ షెడ్యూల్ లో తరచూ మార్పులు జరిగాయి. బిహార్‌లో మాదిరిగానే తమిళనాడు, బెంగాల్‌లో రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
