- పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే
- ఇన్ని సమస్యలు వచ్చేవా?: సీఎం రేవంత్
- దేవాదుల, ప్రాణహిత, ఎస్సారెస్పీలను పూర్తి చేస్తే 967 టీఎంసీలను వాడుకునేవాళ్లం
- కానీ ఒక్క కాళేశ్వరం మీదనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చుపెట్టిన్రు
- కాళేశ్వరం నీళ్లు లేకుండానే రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించినం
- పదేండ్లలో కేసీఆర్, హరీశ్ సాధించిన విజయాలేంది?..అసెంబ్లీలో చర్చిద్దాం
- పక్క రాష్ట్రానికి నీళ్లిస్తున్నారనే చవకబారు ఆరోపణలు ఆపండి
- చర్చల ద్వారానే నీటి సమస్యలను పరిష్కరించుకుంటం
- కేసీఆర్.. మీరేం చింత పెట్టుకోకండి.. ఆరోగ్యం కాపాడుకోండి
- రోజూ యోగా చేయండి.. చినజీయర్ సూక్తులు వినండి
- 2034 వరకు తామే అధికారంలో ఉంటామని వెల్లడి
- మంత్రులతో కలిసి దేవాదుల ప్రాజెక్టు పరిశీలన.. పనులపై రివ్యూ
హైదరాబాద్/మహబూబాబాద్, వెలుగు: గత బీఆర్‌ఎస్ పాలనలో పైసలున్నా ప్రాజెక్టులను కట్టలేదని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేండ్లలో చిత్తశుద్ధితో ప్రాణహిత, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ స్టేజ్ 2, దేవాదులలాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి 967 టీఎంసీల వాటాను వినియోగించుకోవాల్సిందని అన్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తయి ఉంటే.. వరద జలాల్లో వాటా అడిగేవాళ్లమని, కృష్ణా పరీవాహక ప్రాంతానికీ గోదావరి నీళ్లు తీసుకువెళ్లే అవకాశం ఉండేదని చెప్పారు. నాడు నిధులు పుష్కలంగా ఉన్నా కూడా కేవలం ఒక్క కాళేశ్వరం మీదనే రూ.1.10 లక్షల కోట్లను ఖర్చు చేశారని, గోదావరిపై ఉన్న మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఆదివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి దేవాదుల ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు పనులపై అక్కడే అధికారులతో రివ్యూ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు 2001లోనే చంద్రబాబు శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ నిర్మాణం జరుగుతూనే ఉన్నదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక చిత్తశుద్ధితో నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నా.. నిధుల కొరత ఉందన్నారు. రాష్ట్రంపై 8.11 లక్షల కోట్ల అప్పులభారం ఉందని, ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన 20 – 30 శాతం పనులు పూర్తి చేయడానికి కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ రెండేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ భూసేకరణ, మెయింటెనెన్స్, పనులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. 2001లో రూ.6 వేల కోట్ల అంచనాలతో మొదలైన ఈ ప్రాజెక్టుకు.. ఆ తర్వాత సవరణ వ్యయం రూ.13,500 కోట్లకు పెరిగిందని, అనంతరం రూ.14,500 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.18,500 కోట్లకు పెరిగిందని తెలిపారు. వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్యయాలను కేబినెట్‌లో పెట్టాలని, అధికారులు దానికి సంబంధించి వివరాలతో రావాలని స్పష్టం చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేసి తీరుతామని ఆయన తేల్చి చెప్పారు.
కాళేశ్వరం నుంచి రెండేండ్లలో చుక్క ఎత్తిపోయలే
కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతమని గత ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్నా.. రెండేండ్ల నుంచి చుక్క నీరు ఎత్తిపోయకున్నా వరి దిగుబడిలో రాష్ట్రంనెంబర్వన్గా నిలిచిందని సీఎం రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం కల్పించినవన్నీ భ్రమలేనని తేలిపోయిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఏ ఉద్దేశంతో నిర్మించారో ఎప్పుడూ విమర్శలు చేయలేదన్నారు. కృష్ణా నదీ జలాలపైన అపోహలు సృష్టించారని, పక్క రాష్ట్రానికి జలాలను ధారాదత్తం చేస్తున్నామని ఆరోపణలు చేశారని, దానికి అసెంబ్లీలోనే చర్చ పెట్టి అన్నింటికీ సమాధానం ఇచ్చామని పేర్కొన్నారు. ‘‘గత పదేండ్లలో కేసీఆర్, హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రులుగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల్లో ఎలాంటి పురోగతి జరిగింది.. ఉత్తమ్ మంత్రిగా ఉన్న ఈ రెండేండ్లలో ఏ మేరకు ప్రాజెక్టుల పురోగతి జరిగింది”అనేది చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే చెప్పామన్నారు. వాళ్లు తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తే సమాధానమిచ్చామని పేర్కొన్నారు. ‘‘మీ తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేయవద్దు. మీ తప్పులను గుర్తించే ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అట్లైనా మార్పు వస్తుందని ఆశించినం. కానీ, అది జరగలేదు. అవసరమైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గోదావరి జలాలపైనా ఒక రోజు చర్చ చేద్దాం. 10 ఏండ్ల పరిపాలనలో కేసీఆర్, హరీశ్‌రావు సాధించిన విజయాలేందో.. ఈ రెండేండ్లలో మా విజయాలేందో చర్చ చేద్దాం. మా పాలనలో తప్పులుంటే సరిదిద్దుకుంటం. మీరు మాకిచ్చిన వారసత్వమేంటి.. అందులో మేం చేసిన తప్పులేంటో చెప్పండి. తప్పులుంటే సవరించుకోవడానికి మేం సిద్ధం. మేమేమీ 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానులం కాదు. ప్రపంచ మేధావులమనీ చెప్పుకోవట్లేదు. మీరు సూచన చేసినా తీసుకుంటం. మేం చదివి తెలుసుకుంటం.. అడిగి తెలుసుకుంటం. మీ పదేండ్ల అనుభవంతో.. మా రెండేండ్ల అనుభవమున్న ప్రభుత్వానికి సూచనలు చేయండి. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మేం కృషి చేస్తం’’ అని పేర్కొన్నారు.
పక్క రాష్ట్రానికి నీళ్లిస్తున్నామనడం చవకబారు ఆరోపణలే
పక్క రాష్ట్రానికి నీళ్లు తరలించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఇక్కడ పోటీ చేసిన ప్రజాప్రతినిధులెవరైనా ఏపీకి సహకరిస్తారా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఏపీ నుంచి వలసొచ్చి ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచినోళ్లైనా ఏపీకి సహకరిస్తారా? అని నిలదీశారు. ఇలాంటి చవకబారు ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ‘‘కేసీఆర్, హరీశ్‌రావుకు ఒకటే విజ్ఞప్తి. ఇలాంటి చవకబారు ఆరోపణలతో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చకండి. మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాల్లేవు. ప్రతిపక్షం మంచి సూచనలు చేస్తే కచ్చితంగా స్వీకరిస్తం. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్కుందాం. తర్వాత ప్రజలే తీర్పునిస్తరు. అసెంబ్లీ, లోక్‌సభ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పు వచ్చింది. అయినా కూడా వాళ్లలో మార్పు రాలేదు. ప్రజలు వారికి ఓటేయకుండా తప్పు చేశారన్న భ్రమలోనే వాళ్లు మాట్లాడుతున్నారు. మళ్లీ మళ్లీ అలాగే చేస్తే అర్థం లేదు. ప్రజల తీర్పును అర్థం చేసుకుని.. ఎక్కడ గ్యాప్ వచ్చిందో చెక్ చేసుకోండి. అప్పుడే మంచి ప్రతిపక్షంగా పనిచేసేందుకు మీకు అవకాశం ఉంటుంది’’ అని సూచించారు.
ఏ సమస్యకైనా చర్చలతోనే పరిష్కారం
ఎంత కఠినమైన సమస్యకైనా చర్చలతోనే పరిష్కారం దొరుకుతుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మొన్న అక్రిడిటేషన్ కార్డులపై ఏదో సమస్య వస్తే జర్నలిస్టుల కమిటీలు.. ప్రభుత్వ కమిటీ చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోలేదా? అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యంతోనూ చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని, అక్కడ కూడా కాకపోతే జీఆర్ఎంబీ, ట్రిబ్యునల్‌లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అక్కడా పరిష్కారం దొరక్కుంటే కోర్టు లున్నాయన్నారు. డైరెక్ట్‌గా క్లైమాక్స్‌లోకి వెళ్లలేమని, అన్నేండ్లు పాలించినోళ్లకు ఈ విషయం అర్థం కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పక్క రాష్ట్రంతో చర్చలు చేస్తున్నదని, అది ప్రాథమిక దశలో ఉన్నదని, ఎలాంటి భేషజాల్లేకుండా పక్క రాష్ట్రంతో చర్చించి పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ‘‘వివాదం కావాలా? లేదా పరిష్కారం కావాలా? అంటే మేం పరిష్కారమే కోరుకుంటం. పంచాయితీలు కావాలా? చర్చలు కావాలా? అంటే చర్చలే కోరుకుంటం. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి పౌరుడికీ తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి అవసరమయ్యే నిధులను సమీకరించుకుంటం. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తం. కేసీఆర్, హరీశ్‌రావు సహేతుకమైన విమర్శలు చేయాలి’’ అని వ్యాఖ్యానించారు.
2034 వరకు మాదే అధికారం..
రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారమని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరికిచ్చేటప్పుడు వారికి అధికారం ఇస్తారన్నారు. 1994 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌కు ఇచ్చారని, ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్‌కు ఇచ్చారని గుర్తు చేశారు. అక్కడి నుంచి 2034 వరకు తమకు అవకాశం ఇస్తారని చెప్పారు. ‘‘కేసీఆర్.. మీరు ఏం చింత పెట్టుకోవద్దు. ఆరోగ్యం కాపాడుకోండి. మంచి ఆలోచనలొస్తే ఆరోగ్యం కూడా మంచిగనే ఉంటది. అధికారమే మా వారసత్వ ఆస్తి అని కడుపులో ఏదో బాధ పెట్టుకోకండి. దాని వల్ల ఆరోగ్యం దెబ్బతింటది. బాధ ఎక్కువైనా.. దు:ఖమొచ్చినా.. రాత్రి నిద్రలేకపోయినా ఆరోగ్యం పాడైతది. ఆ పరిస్థితులు రాకుండా పదేండ్లు ఆరోగ్యం కాపాడుకోండి. వాకింగ్ చేయండి.. యోగా చేయండి. తెలంగాణ సమాజానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు చదవండి. చినజీయర్ స్వామి సూక్తులు, లోక కల్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. అంతేతప్ప ప్రజలపై విషం చిమ్మి మమ్మల్ని ఏదో శపిస్తే ఏమీ జరగదు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపాలే మాకు దీవెనలు’’ అని పేర్కొన్నారు.
హక్కుల్ని వదులుకోం..
గోదావరి జలాల్లో తెలంగాణ హక్కుల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నికర, వరద జలాల్లో వేటినీ వదులుకోబోమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఆ ప్రాజెక్టును నిరుపయోగం కానివ్వబోమని చెప్పారు. భూమిలోపల ఎలాంటి మార్చులు వచ్చాయో ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కాళేశ్వరం వాళ్ల సొంత ఆస్తి కాదని, ప్రజల సొమ్ము గాలికి వదిలేయలేమని చెప్పారు. దానిని మళ్లీ ఉపయోగంలోకి తెస్తామన్నారు.
భూసేకరణకు రూ.600 కోట్లు
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణ కోసం జూన్ 2 లోపల రూ.600 కోట్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బడ్జెట్‌లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకోవాలని రివ్యూలో అధికారులకు సూచించారు. మార్చిలో మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామన్నారు. నెలలోగా దేవాదుల పంప్ రిపేర్లు చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో దేవాదులపైన కమిటీ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. అన్ని ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్ చానెల్‌లో పరిహారం కోసం నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు
ఆగడానికి వీలు లేదని పేర్కొన్నారు. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీళ్లందించే ప్రణాళికపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వెన్నం సోదరులకు పరామర్శ
మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామంలో వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబాన్ని సీఎం రేవంత్ పరామర్శించారు. ఈ నెల 11న రాఘవేందర్ రెడ్డి(84) అనారోగ్యంతో మృతిచెందగా.. ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాఘవేందర్ రెడ్డి కుమారులు టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, కాంగ్రెస్ సంవిధాన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిగ్ టీవీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డిని కలిసి ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, సీఎం సలహదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు భూక్యా మురళీ నాయక్, జాటోతు రామచంద్రునాయక్ తదితరులున్నారు.
తొందర్లోనే దేవాదుల పూర్తయితది: మంత్రి ఉత్తమ్
దేవాదుల ప్రాజెక్టులను అతి త్వరలోనే పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాదులను ప్రాధాన్య ప్రాజెక్టుగా పరిగణిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ఆ ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయని గుర్తుచేశారు. శక్తిమంతమైన పంపుల ద్వారా 510 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తామని చెప్పారు. 170 రోజుల్లో 38 టీఎంసీలను ఎత్తిపోసి 5.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లందిస్తామన్నారు. జూన్ 2 నాటికి దేవాదులతోపాటు ఇతర ప్రాజెక్టులకు భూసేకరణను పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణకు దక్కే ఒక్క చుక్కనూ వదులుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. ట్రిబ్యునల్, బోర్డుల్లో రాష్ట్ర నీటి హక్కులపై పోరాడుతున్నామన్నారు. అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
