ప్రాజెక్టులకు జలకళ: కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

ప్రాజెక్టులకు జలకళ: కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద నీరు భారీగా పోటెత్తుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు, పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 687.875 అడుగులకు చేరింది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.313 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 20,100 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అవుట్ ఫ్లో 67 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.

►ALSO READ | కుమ్రంభీమ్ జిల్లాలో ఉప్పొంగుతున్న బాహుబలి జలపాతం.. కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు

మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 10.436 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో 66,126 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఇక అవుట్ ఫ్లో విషయానికి వస్తే.. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 275 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతిని ప్రాజెక్టు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లోత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.