వర్షాకాలం వచ్చిందంటే చాలు, తెలంగాణలోని అడవులు, కొండలు పచ్చటి శాలువా కప్పుకున్నట్లు మారిపోతాయి. ఎక్కడ చూసినా జలపాయాలు పరవళ్లు తొక్కుతుంటాయి. ముఖ్యంగా కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రకృతి తన అపురూప సౌందర్యాన్ని సంతరించుకుంది.కుమ్రంభీమ్ జిల్లాలోని తిర్యాని మండలంలో ప్రకృతి మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, ఇక్కడి ప్రఖ్యాత బాహుబలి జలపాతం'ఉగ్రరూపం దాల్చింది. ఎత్తైన కొండల నుంచి నీరు కిందకు దూకుతున్న తీరు ఎంతో అద్భుతంగా, కనువిందుగా ఉంది.
ఈ జలపాతం నుంచి వస్తున్న భీకరమైన శబ్దాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ మార్మోగిస్తున్నాయి. ఆ నీటి హోరు, గర్జనలు చూసేవారికి ఒక అద్భుతమైన అనుభూతిని పంచుతున్నాయి. ఎత్తైన ప్రాంతం నుంచి ఉప్పొంగుతూ వస్తున్న ఈ జలపాత ప్రవాహం, పర్యాటకులను కట్టిపడేస్తోంది.
►ALSO READ | తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు: ములుగు జిల్లా వాజేడులో అత్యధిక వర్షపాతం
ఈ దృశ్యాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున తిర్యాని మండలానికి తరలివస్తున్నారు. బాహుబలి జలపాతం అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ మురిసిపోతున్నారు. జలపాతం నుంచి వెలువడుతున్న ఆ అద్భుతమైన శబ్దాలు, చుట్టూ పచ్చని అడవి నడుమ సాగుతున్న ఈ జల ప్రవాహం తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, వర్షాల సమయంలో జలపాతాల వద్దకు వెళ్లేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
