అమెరికాలో గ్రీన్ కార్డ్ (పర్మనెంట్ రెసిడెన్సి) కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షల మంది వలసదారులకు ఊరటనిచ్చేందుకు కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనేటర్ అలెక్స్ పాడిల్లా (Alex Padilla) ఒక కొత్త బిల్లును ప్రతిపాదించారు. అమెరికాలోని పాత వలస చట్టాలలో మార్పులు తెచ్చి, అర్హులైన వారికి గ్రీన్ కార్డ్ సులభంగా దక్కేలా చేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
ఈ బిల్లులోని హైలెట్స్:
7 ఏళ్ల నిబంధన: అమెరికాలో కనీసం ఏడు సంవత్సరాలుగా నివసించిన వలసదారులు, ఎలాంటి నేర చరిత్ర లేనివారు ఎవరైనా సరే చట్టబద్ధమైన పర్మనెంట్ రెసిడెన్సి (గ్రీన్ కార్డ్) కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.
చట్టం మారడం ఎలా?
1929 నాటి ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. 1972 జనవరి 1కి ముందు అమెరికాలోకి వచ్చిన వారికి మాత్రమే ఇంతకుముందు గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉండేది. ఈ గడువును 1986 నుంచి ఎవరూ మార్చలేదు. ఇప్పుడు పాడిల్లా తెచ్చిన బిల్లు ఆ పాత గడువు తేదీని పూర్తిగా తొలగించి, దానికి బదులుగా "అమెరికాలో 7 ఏళ్లుగా ఉంటున్నారా?" అనే నిబంధనను పెడుతోంది. దీనివల్ల అమెరికాలో ఉంటున్న సుమారు 80 లక్షల మందికి పైగా వలసదారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
భారతీయ H-1B వీసా హోల్డర్లకు
అమెరికాలో H-1B వీసాలపై పనిచేస్తున్న వారిలో అత్యధికంగా భారతీయ నిపుణులే ఉన్నారు. ప్రతి ఏటా జారీ చేసే 85వేల H-1B వీసాలలో దాదాపు 70% భారతీయులకే దక్కుతుంటాయి.
గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ నుండి విముక్తి:
ప్రస్తుతం దాదాపు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం లైన్‌లో (బ్యాక్‌లాగ్‌లో) సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. ఉపాధి ఆధారిత (Employment-based) గ్రీన్ కార్డులపై దేశాల వారీగా ఉన్న పరిమితుల వల్ల వీరు దశాబ్దాల నిరీక్షణను ఎదుర్కొంటున్నారు. ఈ బిల్లు చట్టమైతే వారికి గ్రీన్ కార్డ్ పొందడానికి మరో సులభమైన మార్గం దొరుకుతుంది.
►ALSO READ | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: ఒక్కరోజే 888 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. పరుగులు పెట్టిన నిఫ్టీ!
భారతీయ విద్యార్థులకు ప్రయోజనం:
చదువు పూర్తి చేసుకుని అమెరికాలో ఉద్యోగాలు చేసే విద్యార్థులు (OPT పై ఉన్నవారు).. ఆ తర్వాత H-1B వీసాకు మారి, అక్కడి నుంచి గ్రీన్ కార్డ్ కోసం చాలా కాలం కష్టపడాల్సి వస్తుంది. ఈ బిల్లు అలాంటి వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఈ బిల్లు చట్టం అవుతుందా?
అమెరికా రాజకీయాల్లో వలసల అంశం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇస్తున్నప్పటికీ, రిపబ్లికన్ పార్టీ నుంచి దీనికి గట్టి పోటీ ఉంది.
కొందరు రిపబ్లికన్సెక్ నాయకులు హెచ్-1బి వీసాలను పూర్తిగా రద్దు చేయాలని లేదా వాటి సంఖ్యను తగ్గించాలని (ఎండ్ హెచ్-1బి వీసా అబ్యూస్ యాక్ట్) కొత్త బిల్లులు తెస్తున్నారు. కాబట్టి, అలెక్స్ పాడిల్లా బిల్లు చట్ట రూపం దాల్చాలంటే అమెరికా కాంగ్రెస్‌లో ఉభయ సభల ఆమోదం పొందడం అంత ఈజీ కాదు.
