- టీజీపీడబ్ల్యూయూ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్
హైదరాబాద్, వెలుగు: ఎయిర్ పోర్టుల్లో బోర్డింగ్ గేట్లు, ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఉడాన్ యాత్రి కేఫ్‌లు ప్రారంభించాలని.. ప్యాసింజర్లు కూడా ఇదే కోరుకుంటున్నారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఎయిర్ పోర్ట్స్ లో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఉడాన్ యాత్రి కేఫే (ఉడాన్ యాత్రి కేఫ్)పై ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి నివేదికను విడుదల చేశామని ఆయన తెలిపారు.
ఈ సర్వేలో మొత్తం 2,800 మంది ప్రయాణికులు పాల్గొన్నారని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సర్వే ఫలితాల ప్రకారం కేవలం 26% (720 మంది) మాత్రమే ఈ సదుపాయం గురించి తెలుసునని చెప్పగా.. 74% (2,080 మంది) ప్రయాణికులకు ఈ కెఫే గురించి తెలియదని వెల్లడైందని షేక్ సలావుద్దీన్ తెలిపారు.
ఈ ఫలితాలు ప్రయాణికులకు సమాచారం అందించడంలో యాప్ ఆధారిత డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని సర్వేలో వెల్లడైందన్నారు. అయితే, అధికారిక ప్రకటనలు, సైన్‌బోర్డులు, అవగాహన కార్యక్రమాలు తక్కువగా ఉన్నాయని స్పష్టం అవుతోందని సలావుద్దీన్ తెలిపారు. “ఉడాన్ యాత్రి కేఫే పై అవగాహన, అందుబాటు, విజిబిలిటీ పెంచితే మరింత మంది ప్రయాణికులు ఈ తక్కువ ధరల సేవలను ఉపయోగించుకుంటారు. ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది” అని షేక్ సలాహుద్దీన్ తెలిపారు.
