- పైప్‌లైన్ పనుల ఎంబీ రికార్డు చేసేందుకు రూ. 10 వేలు డిమాండ్
- ప్రైవేట్ వ్యక్తికి ఫోన్ పే చేయించుకున్న డీఈ
పాలకుర్తి, వెలుగు : ఎంబీ రికార్డు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పాలకుర్తి మిషన్ భగీరథ డీఈని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్ కమ్మగాని సురేశ్.. దేవరుప్పుల మండలంలోని చిన్నమడూరు, పెద్దమడూరు, కోలుకొండ గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు చేశాడు. ఇందుకు సంబంధించి రూ. 1.05 లక్షల బిల్లు రావాల్సి ఉంది.
బిల్లు మంజూరు చేసేందుకు ఎంబీ రికార్డు చేయాలని ఇటీవల పాలకుర్తి డీఈ సంధ్యారాణిని కలిశాడు. రూ. 10 వేలు ఇస్తేనే బిల్లు చేస్తానని డీఈ చెప్పడంతో ఒప్పుకున్న కాంట్రాక్టర్.. తర్వాత ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
వారి సూచనతో డబ్బులు ఇచ్చేందుకు శుక్రవారం డీఈని సంప్రదించగా.. మహేందర్ అనే వ్యక్తికి ఇవ్వాలని ఆమె సూచించడంతో ఫోన్‌పే ద్వారా అతడికి డబ్బులు పంపించాడు. తర్వాత డీఈని కలిసి డబ్బులు పంపించిన స్క్రీన్ షాట్‌ను చూపించాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు డీఈ సంధ్యారాణిని పట్టుకున్నారు. దాడిలో సీఐలు ఎస్.రాజు, ఎల్.రాజు పాల్గొన్నారు.
