హనుమకొండ సిటీ, వెలుగు: ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ఘటన సుబేదారి పీఎస్ పరిధి ఎక్సైజ్ కాలనీలో శుక్రవారం జరిగింది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఎక్సైజ్ కాలనీకి చెందిన మామిండ్ల నవ్య ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి మాస్క్ పెట్టుకుని వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని రెండున్నర తులాల పుస్తెలతాడు తెంపుకుని పరుగులు తీశాడు.
ఆమె కేకలు వేయగా, అప్పటికే పక్క గల్లీలో వెయిట్ చేస్తున్న మరో యువకుడి బైక్ ఎక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, సుబేదారి సీఐ రంజిత్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తొందర్లోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
