కారుకు దారి ఇవ్వలేదని దళితుడిపై దాడి.. జగిత్యాల జిల్లా చిన్నాపూర్‌‌ సర్పంచ్ భర్త దాష్టీకం

 కారుకు దారి ఇవ్వలేదని దళితుడిపై దాడి.. జగిత్యాల జిల్లా చిన్నాపూర్‌‌ సర్పంచ్ భర్త దాష్టీకం

జగిత్యాల, వెలుగు : హారన్‌‌ కొట్టినా పక్కకు జరగలేదన్న కోపంతో సర్పంచ్‌‌ భర్త ఓ దళితుడిపై దాడి చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌‌ గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నాపూర్‌‌ సర్పంచ్‌‌ గట్టు శారద భర్త గంగారాం శుక్రవారం తన కారు పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన దమ్మ తిరుపతి అడ్డుగా ఉండడంతో గంగారాం హారన్‌‌ కొట్టాడు. అయినా తిరుపతి పక్కకు జరగకపోవడంతో ఆగ్రహానికి గురైన గంగారాం తిరుపతిని చితకబాదాడు. అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి మరోసారి తిరుపతిపై దాడి చేయడంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి.

సీసీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అవుతున్నాయి. బాధితుడు తిరుపతి తల్లి దమ్మ లక్ష్మి ఫిర్యాదుతో సర్పంచ్ భర్త గట్టు గంగారాంతో పాటు అతడి అనుచరులు గంగాధర్, గణేశ్‌‌, శ్రవణ్‌‌పై కేసు నమోదు చేసినట్లు ధర్మపురి సీఐ నరసింహారెడ్డి చెప్పారు. దాడి విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్‌‌ నేతలు.. జగిత్యాల హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న తిరుపతిని పరామర్శించారు.