జనగామ అర్బన్, (బచ్చన్నపేట)/ రఘునాథపల్లి (లింగాల ఘనపూర్), వెలుగు : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని బచ్చన్నపేట కేజీబీవీ పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కిచెన్ ను సందర్శించి కూరగాయలు, సామగ్రి, గుడ్ల నాణ్యతను పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు గురించి ఎస్వోను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం లింగాలఘనపూర్ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను ఆయన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేలా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా వైద్యారోగ్య శాఖకు ఇవ్వగా, నియోజకవర్గ కేంద్రంలోని పీహెచ్సీలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, 100 పడకల ఆస్పత్రిని ఈఏడాది చివరి వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు.
