ఇరాన్ అణు పరీక్షలు చేస్తుందా..? : అందుకేనా పదే పదే భూ ప్రకంపనలు..!

ఇరాన్ అణు పరీక్షలు చేస్తుందా..? : అందుకేనా పదే పదే భూ ప్రకంపనలు..!

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న వేళ.. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరం సమీపంలో సంభవించిన భూకంపం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. శనివారం ఉదయం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఈ భూకంపం రావడంతో.. ఇది సహజ సిద్ధమైనదా లేక అణ్వాయుధాల పరీక్షించటం వల్ల ఫలితమా అనే అనుమానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సాధారణంగా 4.1 తీవ్రత కలిగిన భూకంపం వల్ల పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగదు. అధికారులు కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, సునామీ ముప్పు లేదని ధృవీకరించారు. అయితే ఇరాన్ అణ్వాయుధ తయారీ దిశగా అడుగులు వేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న నేపథ్యంలో నమోదైన ఈ భూకంపం అణు పరీక్షల వల్ల వచ్చిందా అనే కోణంలో చర్చ మొదలైంది. కానీ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి అణు పరీక్షలు జరిగినట్లు అధికారికంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం యుద్ధ వాతావరణం ఉండటం వల్లనే ఇటువంటి ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి.

వారం రోజుల వ్యవధిలోనే ఇరాన్‌లో రెండోసారి భూకంపం రావడం గమనార్హం. గత మంగళవారం కూడా దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. వరుసగా ప్రకంపనలు రావడం ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ భౌగోళికంగా భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉండటం వల్ల ఇవి సహజ ప్రక్రియలేనని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ భూకంపానికి విభిన్న ఆలోచనల దిశగా నడిపిస్తున్నాయి. 

మరోవైపు.. ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ గగనతల దాడులు నిర్వహిస్తున్న తరుణంలో ఈ ప్రకంపనలు రావడం అందరూ డిఫరెంట్ గా ఆలోచించేలా చేస్తోంది. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని వాదిస్తున్నప్పటికీ, అగ్రరాజ్యాలు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా బందర్ అబ్బాస్ భూకంపం ప్రస్తుతానికి సహజమైనదిగానే పరిగణించబడుతున్నా.. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మాత్రం ప్రపంచ దేశాలను ఆందోళనలోకి నెట్టుతున్నాయి.