సొంత ఇల్లు కొనుక్కోవటం అనేది చాలా మంది భారతీయుల జీవితంలో పెద్ద మైలురాయిగా భావిస్తారు. కానీ అది ఒకేసారి జీవితకాలపు అప్పుగా మారుతుందన్న విషయం చాలా మందికి అర్థం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకుల వడ్డీ రేట్లు, EMI ల వివరాల వరకూ మాత్రమే ఆలోచిస్తూ అప్పుల ఉచ్చులో నిశబ్ధంగా చిక్కుకుపోతున్నారు భారతీయ ప్రజలు. ఫలితంగా వారి కలల ఇల్లు, దశాబ్దాల రుణ భారంగా మారుతోందని గమనించటం లేదు.
అయితే 20 ఏళ్ల హోం లోన్‌ని 12 ఏళ్లకే ముగించే ‘స్మార్ట్’ ప్లాన్ గురించి చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. సాధారణంగా 8 శాతం వడ్డీతో 20 ఏళ్ల పాటు తీసుకున్న రూ.50 లక్షల హోమ్ లోన్‌పై చివరికి మొత్తం రూ.48 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది దాదాపు మరో ఇంటిని కొనగలిగేంత సొమ్ముకు సమానం అని కౌశిక్ చెప్పారు. లోన్ తీసుకున్నప్పుడు మెుదట్లో బ్యాంకులు మనం చెల్లించే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకి మళ్లిస్తుంటాయి. దీంతో అసలు తీసుకున్న లోన్ మెుత్తంలో జమ అయ్యేది చాలా తక్కువని ఆయన గుర్తుచేశారు. అయితే ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయితే స్టోరీ మెుత్తాన్ని మార్చేయెుచ్చని చెబుతున్నారు కౌశిక్. ఒక వ్యక్తి రూ.50 లక్షల హోమ్ లోన్ నెలకు రూ.14వేల 800 ఈఎంఐ చొప్పున 20 ఏళ్ల కాలం తీసుకున్నప్పుడు స్మార్ట్ ప్లాన్ ఎలా చేయాలో కౌశిక్ వెల్లడించారు.
సీఏ చెప్పిన స్మార్ట్ ప్లాన్..
హోమ్ లోన్ విషయంలో వడ్డీ మొత్తం ఎప్పుడూ మిగిలిన ప్రిన్సిపల్‌పై మాత్రమే లెక్కించబడుతుంది కాబట్టి.. ప్రిన్సిపల్‌ను తొందరగా తగ్గిస్తే, భవిష్యత్ వడ్డీ కూడా తగ్గుతుందని సీఏ సూచిస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఏటా మీరు ఒక అదనపు ఈఎంఐ ప్రీపేమెంట్ రూపంలో కట్టగలిగితే 4వ ఏట చివరి నాటికి రూ.2లక్షల 50వేలు ప్రీపే అవుతుంది. ఆ తర్వాత 5వ సంవత్సరం నుంచి 10వ ఏడాది మధ్యలో ఏడాదికి 2 నుంచి 3 ఈఎంఐలు ప్రీపేమెంట్ చేస్తే లక్ష రూపాయలు ఏటా ముందుగా చెల్లించినట్లు అవుతుంది. దీంతో 12 ఏళ్ల 5 నెలల్లోనే చెల్లించాల్సిన లోన్ పూర్తవుతుంది. ఇలా చేయటం వల్ల 35 లక్షల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లిస్తారు. అంటే రూ.13 లక్షలు సేవ్ చేసుకోవటంతో పాటు 7 ఏళ్లు ముందుగానే అప్పు తీరిపోయి మానసిక ప్రశాంతత కూడా పొందుతారు. ఇదే స్మార్ట్ ప్లానింగ్ బెనిఫిట్ అని కౌశిక్ చెప్పారు. హోం లోన్ తీసుకోవడం కన్నా, దాన్ని తెలివిగా తగ్గించుకోవడం నేర్చుకోవడమే అసలు ఆర్థిక విజయ రహస్యం.
ALSO READ : రష్యన్ క్రూడ్‌కి దూరంగా రిలయన్స్
10–12 సంవత్సరాల తర్వాత ప్రీపేమెంట్ ప్రయోజనం తగ్గుతుంది. అప్పుడు అదనపు డబ్బు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా Nifty50 పెట్టుబడుల్లో పెట్టడం మెరుగైనదని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి చెల్లింపు తర్వాత 30 రోజుల్లో బ్యాంక్ అన్ని డాక్యుమెంట్లు (టైటిల్ డీడ్లు, NOC, లియన్ తొలగింపు) తిరిగి కలెక్ట్ చేసుకోవటం ముఖ్యం.
