రష్యన్ క్రూడ్‌కి దూరంగా రిలయన్స్: యూరప్ ఆంక్షలతో కీలక నిర్ణయం

రష్యన్ క్రూడ్‌కి దూరంగా రిలయన్స్: యూరప్ ఆంక్షలతో కీలక నిర్ణయం

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఆయిల్ రిఫైనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజాగా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్ రిఫైనరీలో రష్యన్ క్రూడ్ ఆయిల్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఈ నిర్ణయం యూరోపియన్ యూనియన్ జనవరి 2026 నుంచి అమలు చేయబోయే కొత్త ఆంక్షల నేపథ్యంలో వచ్చింది. ఆంక్షల కింద రష్యన్ క్రూడ్ ఆయిల్ వాడి తయారైన ఉత్పత్తులను యూరప్‌లోకి దిగుమతిని నిలిపివేయబడనుంది. 

రిఫైనరీ అధికారులు నవంబర్ 20 నుంచి SEZ యూనిట్‌లో రష్యన్ క్రూడ్‌ దిగుమతులను నిలిపివేశారని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఎగుమతి అయ్యే ఇంధనం మొత్తం రష్యన్ ముడి చమురు ఆధారంగా తయారైనవి కాకుండా ఇతర దేశాల నుంచి కొన్న క్రూడాయిల్ నుంచే ప్రాసెస్ అవుతుందని సంస్థ స్పష్టం చేసింది. దీంతో షెడ్యూల్ కి ముందే రిలయన్స్ తన ప్రణాళికను సంసిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. 

రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ప్రాసెసింగ్ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది రెండు విభాగాలుగా పనిచేస్తోంది. ఒకటి ఎగుమతి ప్రధానమైన SEZ యూనిట్ కాగా.. మరొకటి దేశీయ మార్కెట్‌ అవసరాల కోసం పనిచేసే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా రిఫైనరీ. కొత్త నిబంధనలు SEZ యూనిట్‌కే వర్తిస్తుండటంతో.. నవంబర్ 20 తర్వాత వచ్చే రష్యన్ క్రూడ్ మొత్తాన్ని DTA ప్లాంట్‌కు మళ్లించనున్నట్లు రిలయన్స్ కంపెనీ స్పష్టం చేసింది. 

ALSO READ : టాటా గ్రూప్‌లో ఊహించని పరిణామం

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్‌లో రష్యన్ క్రూడా ఆయిల్ దిగుమతులకు పెద్ద కొనుగోలుదారుగా రిలయన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. రోజుకు సగటున 5 లక్షల బ్యారెళ్ల వరకు రష్యన్ క్రూడ్ కొనుగోలు చేసే ఒప్పందం రోస్నెఫ్ట్‌తో కొనసాగుతోంది. అయితే అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ లాంటి దేశాలు విధించిన కఠిన ఆంక్షల కారణంగా రిలయన్స్ కొనుగోలు వ్యూహాన్ని వ్యూహం మార్పు దిశగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల నుంచి కొత్త క్రూడ్ సరఫరాలను అన్వేషిస్తోంది.

ప్రస్తుతం భారత్ రష్యన్ చమురుపై దాదాపు మూడవ వంతు ఆధారపడి ఉంది. ఇందులో రిలయన్స్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ కంపెనీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. SEZ యూనిట్‌లో రష్యన్ చమురును నిలిపివేయడం ద్వారా రిలయన్స్ అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా ముందడుగు వేసింది. అయితే భవిష్యత్తులో రిలయన్స్ ఇండియా వ్యాపారం కూడా మార్పులకు గురయ్యే అవకాశం ఉందని తాజా పరిణామాలు చెబుతున్నాయి.