టాటా గ్రూప్‌లో ఊహించని పరిణామం: మెున్న టీసీఎస్ ఇప్పుడు టాటా న్యూ ఉద్యోగుల లేఆఫ్స్..!

టాటా గ్రూప్‌లో ఊహించని పరిణామం: మెున్న టీసీఎస్ ఇప్పుడు టాటా న్యూ ఉద్యోగుల లేఆఫ్స్..!

Tata Neu Layoffs: దేశంలోనే అతిపెద్ద వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్‌ రతన్ టాటా మరణం తర్వాత పెద్ద మార్పుల దిశగా నడుస్తోంది. గతంలో టాటా కంపెనీలో జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా భావించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించటం లేదు. ఒకదాని తర్వాత మరొక టాటా సంస్థల్లో తొలగింపుల గురించి వస్తున్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 

టాటా గ్రూప్ లో లేఆఫ్స్ తుపాన్ ఆగటం అనే మాట లేకుండా కొనసాగుతోంది. ఇటీవల టీసీఎస్‌లో 12 వేల టెక్కీల తొలగింపుల వార్త ప్రజల్లో ఆందోళన సృష్టిస్తుండగా.. తాజాగా గ్రూప్‌కి చెందిన డిజిటల్ విభాగం టాటా డిజిటల్‌లో మరో పెద్ద తొలగింపులు రానున్నట్లు సమాచారం. టాటా న్యూ (Tata Neu) సూపర్‌ యాప్ నిర్వహణలో భాగంగా సంస్థ దాదాపు 50 శాతం ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సీఈఓ సజిత్ శివానందన్‌ రాకతో పునర్‌వ్యవస్థీకరణ ప్లానింగ్ జరుగుతున్నట్లు వెల్లడైంది. 

టాటా న్యూ ప్రారంభ దశలో యూజర్లలో భారీ ఆశలు రేకెత్తించినా.. గత రెండేళ్లుగా ఆ యాప్ ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. తరచూ వ్యూహాల్లో మార్పులు, ఉన్నతాధికారుల రాజీనామాలు సంస్థ పనితీరును మరింత దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో సజిత్ శివానందన్‌ టాటా న్యూ దిశను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దృష్టి ఇప్పుడు అమ్మకాల కంటే లాభాలను పెంపు, ఖర్చుల తగ్గింపుపై ఉన్నందున లేఆఫ్స్ తప్పవని తెలుస్తోంది. 

ప్రణాళికల్లో భాగంగా టాటా డిజిటల్‌‌లో ఉన్న అన్ని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫార్మ్‌లను ఒకే వేదికలో విలీనం చేస్తున్నారు. దీంతో ఖర్చులు తగ్గటంతో పాటు ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గనుంది. ఇప్పటికే బిగ్‌బాస్కెట్‌, క్రోమా కూడా పరివర్తన దశలో ఉన్నాయి. బిగ్‌బాస్కెట్‌ తన BB Now ఫాస్ట్ డెలివరీ సేవలను బలోపేతం చేస్తూ.. బ్లింకిట్‌, జొమాటో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లతో పోటీపడే వ్యూహాన్ని అనుసరిస్తోంది. మరోవైపు క్రోమా నష్టాల్లో ఉన్న స్టోర్‌లను మూసేసి, ఆఫ్‌లైన్ విక్రయాలను బలోపేతం చేస్తోంది. మెయిన్ ఫోకల్ లాభాలను పెంచటంపైనే కొనసాగుతోంది. 

2025 ఆర్థిక సంవత్సరంలో టాటా డిజిటల్‌ ఆదాయం 13.8 శాతం తగ్గి రూ. 32వేల188 కోట్లకు చేరింది. అయినా సంస్థ నికర నష్టాలు ఏడాది ప్రాతిపదికన రూ.వెయ్యి201 కోట్ల నుంచి రూ.828 కోట్లకు తగ్గాయి. ఈ కంపెనీని లాభాల దిశగా నడిపించడం కొత్త మేనేజ్‌మెంట్‌ ముందు పెద్ద సవాలుగా మారిన వేళ ఉద్యోగుల కోతలు తప్పటం లేదని వెల్లడైంది.