చనిపోయే ముందు 5 సార్లు మొరపెట్టుకున్నా టీచర్ పట్టించుకోలే.. కన్నీళ్లు తెప్పిస్తున్న 4వ తరగతి స్టూడెంట్ ఆత్మహత్య !

చనిపోయే ముందు 5 సార్లు మొరపెట్టుకున్నా టీచర్ పట్టించుకోలే.. కన్నీళ్లు తెప్పిస్తున్న 4వ తరగతి స్టూడెంట్ ఆత్మహత్య !

పిల్లలకు మంచి చదువు చెప్పించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటుంటారు. అందుకోసం అష్టకష్టాలు పడి ఎంత శక్తికి మించి ఫీజులు కడుతూ పెద్ద పెద్ద స్కూళ్లల్లో చేర్పిస్తుంటారు. విద్య కార్పోరేటీకరణ తర్వాత ఎంత ఫీజు ఉంటే అంత గొప్ప స్కూల్ అనే ముద్ర పడిపోయింది. లక్షల్లో ఫీజులు తీసుకుంటున్న స్కూళ్లు పిల్లల కేరింగ్ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో ఈ ఘటన సరైన ఉదాహరణ. 

ఒక 4వ తరగతి చిన్నారి 18 నెలలుగా హేళనకు, అవమానానికి గురవుతూ నరకయాతన అనుభవించి సూసైడ్ చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. సాటి పిల్లలు హేళన చేస్తూ.. ఆ పాపను డిస్ట్రిమినేట్ చేస్తూ.. ఆత్మన్యూనతా భావానికి గురి చేయడంతో.. టీచర్స్ కు చెప్పినా పట్టించుకోక పోవడంతో 9 ఏళ్ల చిన్నారి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయింది. ఇక్కడ కన్నీళ్లు తెప్పించే విషయం ఏమిటంటే.. చనిపోయే ముందు ఆ చిన్నారి తన క్లాస్ టీచర్ తో మొరపెట్టుకుంది. చనిపోయే ముందు 45 నిమిషాల్లో 5 సార్లు మొరపెట్టుకుంది. కానీ ఆ టీచర్ కు ఆ చిన్నారి గుండెలో సుడితిరిగే కల్లోలం కనపడలేదు. ఆ టీచర్ నిర్లక్ష్యానికి చివరికి బంగారు భవిష్యత్ ఉన్న స్టూడెంట్ కొన్ని వారాల క్రితం ఆత్మహత్య చేసుకుంది. 

ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నివేదికలో స్కూల్ యాజమాన్యం, క్లాస్ టీచర్స్ నిర్లక్ష్య వైఖరిపై షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 

జైపూర్ లోని నీర్జా మోది స్కూల్ లో తన క్లాస్ మేట్స్ తో పాటు ఇతర స్టూడెంట్స్ కలిసి ఆ చిన్నారిని బూతులు తిడుతూ వేధించేవారట. ముఖ్యంగా అదే క్లాస్ లో ఉన్న పురుష పోకిరీ విద్యార్థులు, వేరే క్లాస్ విద్యార్థులు కలిసి చిన్నారిని వేధించడంతో.. తీవ్ర దిగ్భ్రాంతికి లోనై తనువు చాలించింది. 4వ తరగతిలో కూడా పోకిరీలు ఉంటారా అంటే.. ఈ ఇన్సిడెంట్ తర్వాత నమ్మాల్సిందే. చిన్నారి సూసైడ్ తర్వాత వేసిన విచారణ కమిటీ నివేదికలో ఈ విషయాలు ఉన్నారు. స్కూల్ లో చాలా సమస్యలు ఉన్నాయని.. అందులో విద్యార్థులు ఒక విద్యార్థిని టార్గెట్ చేసి హేళన చేసి టార్చర్ పెట్టడం కారణంగానే ఆ చిన్నారి చనిపోయినట్లు నివేదిక వెల్లడించింది. 

ఈ వేధింపులకు సంబంధించి 2024 లోనే ఆ చిన్నారి పేరెంట్స్ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చిన్నారి బాధను తగ్గించి, ఆమెకు ధైర్యం చెప్పడంలో, ఇతర విద్యార్థులను నిలువరించడంలో క్లాస్ టీచర్ ఫెయిల్ అయినట్లు నివేదిక పేర్కొంది. చనిపోయే ముందు 45 నిమిషాల్లో ఆ చిన్నారి 5 సార్లు తన బాధను చెప్పుకున్నా.. పట్టించుకోలేదంటే ఆ స్టూడెంట్ పట్ల ఆ టీచర్ వైఖరి ఎలా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 

తెలిసే జరిగిందా..?

పేరెంట్స్ కంప్లైంట్ ప్రకారం.. ఇదంతా తెలిసే జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ క్రమశిక్షణ కమిటీకి, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేకపోయారని ఆరోపిస్తున్నారు. పోకిరి పోరల కారణంగా క్లాస్ రూమ్ లో జరిగే వేధింపుల గురించి స్కూల్ మేనేజ్మెంట్ కు స్పష్టంగా తెలుసునని, క్లాస్ టీచర్ సహా మేనేజ్మెంట్ ఆ చిన్నారి విషయంలో కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. దీంతో ఆ చిన్నారి ఆత్మహత్య చేసుకుందని నివేదిక పేర్కొంది. స్కూల్ బోర్డుకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది.