రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) లో కీలకమైన ఉత్తర భాగం పనులు ఇక ఊపందుకోనున్నాయి. ఇటీవల ట్రిపుల్ ఆర్ నార్త్‌కు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఇంజినీర్లు రెడీ అవుతున్నారు. నార్త్ పార్ట్‌లోని సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనులను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లకు మారుస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, తాజాగా దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
పెరిగిన అంచనాల ప్రకారం 161.5 కిలో మీటర్ల ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.15,627 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీంతో ఇంజినీర్లు టెండర్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. గతంలో ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవగా.. ఇప్పుడు హ్యామ్ మోడల్‌లో పనులు మొదలుపెట్టనున్నారు.
ఆరు లేన్ల రహదారి
హైదరాబాద్ నగరం చుట్టూ సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు.. హై-స్పీడ్ రవాణా కారిడార్‌ను సృష్టించేందుకు ట్రిపుల్ ఆర్‌ను భారతీమాల–1 ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ భారీ ట్రాఫిక్‌ను మళ్లించడం, అంతర్రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులకు అనుసంధానించడం దీని ఉద్దేశం. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దారు. రూ.36 వేల కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 343.5 కిలో మీటర్ల పొడవున నిర్మించాల్సిన రోడ్డును రెండు పార్ట్‌లుగా విభజించారు.
నార్త్ పార్ట్ 161.5 కిలో మీటర్లు, సౌత్ పార్ట్ 182 కిలో మీటర్లుగా నిర్ణయించారు. మొదట నార్త్ పార్ట్ పనులు పూర్తిచేయాలని ప్రాజెక్ట్ డీపీఆర్ రెడీ చేశారు. 4 లేన్స్‌తో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం రూ.7,104.06 కోట్లతో 2024 డిసెంబర్లోనే టెండర్లు పిలిచారు. ఆ తర్వాత పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్ఆర్ రోడ్డును ఆరు లేన్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికారులు రీ ప్రపోజల్స్ రెడీ చేయించారు. పెరిగిన అంచనాల ప్రకారం నార్త్ పార్ట్ రోడ్డు నిర్మాణానికి రూ.15,627 ఖర్చు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది.
హైబ్రిడ్ యాన్యూటీ మోడల్లో..
ట్రిపుల్ఆర్రోడ్డు నార్త్ పార్ట్ పనులకు సంబంధించి161.5 కిలో మీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) పద్ధతిలో నిర్మించడానికి అధికారులు సిద్ధమయ్యారు. గతంలో ఈపీసీ మోడల్‌లో టెండర్లు పిలవగా.. నిధుల కొరత కారణంగా ఇప్పుడు హ్యామ్ పద్ధతికి మార్పుచేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకున్నది. మొత్తం 6 ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థ రెండున్నరేండ్ల పీరియడ్‌లో పనులు కంప్లీట్ చేయాలి. 15 ఏండ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి.
రెండున్నరేండ్ల వర్క్ పీరియడ్‌లో టెండర్ కాస్ట్లో 40 శాతం బిల్లులు చెల్లిస్తారు. మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్ట్ సంస్థ సొంతంగా లేదా ఏదైనా బ్యాంకులో అప్పుగా తీసుకోవచ్చు. దీనికి ఎన్‌హెచ్‌ఏఐ బాధ్యత తీసుకుంటుంది. ఆర్‌బీఐ రేపో రేటు 3 శాతం ప్రకారం బిల్స్ బకాయిలపై వడ్డీ కలిపి 15 ఏండ్ల పీరియడ్‌లో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. ఎన్‌హెచ్‌ఏఐ 60 శాతం నిధులను ప్రతి ఆరు నెలలకు ఒక కిస్తీ చెల్లిస్తుంది. ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేస్తే పనులు పూర్తయ్యాక రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థకు ఉండదు.
