- డీఎంఈ పరిధిలో 1,900 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ
- ఆ ఒక్క ఏడాది రూల్ సడలిస్తే.. వెంటనే 250 మందికిపైగా ఫ్యాకల్టీ రెడీ
- లాటరల్ ఎంట్రీ ఇస్తే.. పైసా ఖర్చు లేకుండానే సమస్య క్లియర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. చెప్పుకోవడానికి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్నా.. పాఠాలు చెప్పేటోళ్లు కరువయ్యారు. దాదాపు1,900 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులే చెప్తున్నారు.
కొన్ని డిపార్ట్ మెంట్లలో అయితే ఒక్కరంటే ఒక్క ప్రొఫెసర్ కూడా లేరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పిల్లలకు పాఠాలు చెప్పే అర్హత ఉన్న డాక్టర్లు డీపీహెచ్, టీవీవీపీ పరిధిలో వందల మంది ఉన్నారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్, టీవీవీపీ పరిధిలో ఉన్న పీజీ చేసిన స్పెషలిస్టులను డీఎంఈ పరిధిలోకి తీసుకొస్తే కొంతమేర ఫ్యాకల్టీ కొరతను తగ్గించవచ్చు. కానీ మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్ పేరు చెప్పి కాలయాపన చేయడం వల్ల.. మెడికల్ కాలేజీల్లో అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పని చేసే డాక్టర్లకు పీజీ సీట్లలో ఇన్ సర్వీస్ కోటా ఉంటుంది. వీళ్లు సర్కార్ జీతం తీసుకుంటూనే పీజీ పూర్తి చేస్తారు.
అయితే, ప్రభుత్వ ఖర్చుతో చదివారు కాబట్టి, పీజీ అయ్యాక పదేండ్ల పాటు కచ్చితంగా టీచింగ్ హాస్పిటల్స్ లో (డీఎంఈ పరిధిలో) పని చేస్తామని బాండ్ రాసిస్తారు. ఒకవేళ మాట తప్పితే రూ. 50 లక్షల జరిమానాతో పాటు, చదివిన టైంలో తీసుకున్న జీతం కూడా కట్టాల్సిందే. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు పీజీ పూర్తి చేసుకున్న దాదాపు 250 మంది డాక్టర్లు డీఎంఈలో చేరడానికి రెడీగా ఉన్నారు. కానీ డీఎంఈ ఆఫీసర్లు మాత్రం ఏవేవో టెక్నికల్ కారణాలు చెబుతూ వారిని చేర్చుకోవడంలేదు. ఫలితంగా వాళ్లు టీచింగ్ హాస్పిటల్స్ లో కాకుండా వేరే చోట డ్యూటీలు చేయాల్సి వస్తోంది.
ఆ ఒక్క రూల్ తీసేస్తే...
పీజీ పూర్తయిన వెంటనే డీఎంఈ పరిధిలోకి తీసుకోవడానికి ఓ నిబంధన అడ్డొస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు. పీజీ అయ్యాక ఏడాది గ్యాప్ ఉండాలనే రూల్ ను సాకుగా చూపుతున్నారు. ఇప్పుడున్న ఎమర్జెన్సీలో ఆ ఒక్క రూల్ సడలిస్తే.. సుమారు 250 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బాధ్యతలు తీసుకునే చాన్స్ ఉంది.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రూల్స్ ప్రకారం కాలేజీల గుర్తింపు నిలబడాలంటే ఫ్యాకల్టీ తప్పనిసరి. ఈ చిన్న సవరణ చేస్తే.. అటు ఎన్ఎంసీ నిబంధనలు పాటించినట్టవుతుంది, ఇటు స్టూడెంట్లకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు దొరుకుతారని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పైసా ఖర్చు లేకుండానే ఫ్యాకల్టీ..
ఇన్ సర్వీస్ డాక్టర్లను మెడికల్ కాలేజీల్లోకి తీసుకుంటే ప్రభుత్వానికి నయా పైసా అదనపు ఖర్చు ఉండదు. ఎందుకంటే వాళ్లు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులే. ఇప్పటికే జీతాలు తీసుకుంటున్నారు. కేవలం వాళ్ల హోదాను సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మారుస్తూ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది(లాటరల్ ఎంట్రీ). ఇంత సింపుల్ సొల్యూషన్ కళ్ల ముందు కనిపిస్తున్నా.. అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుబాటులో ఉన్న మానవ వనరులను వాడుకోకుండా, కొత్త నియామకాలు కూడా చేపట్టకుండా కాలయాపన చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా స్పెషల్ మెమో జారీ చేసి.. ఇన్ సర్వీస్ స్పెషలిస్టులను లాటరల్ ఎంట్రీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించాలని వైద్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
