ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) త్వరలో పెద్ద మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని ప్రకారం పీఎఫ్ (PF) ఇంకా పెన్షన్ (EPS) పథకాలలో చేరడానికి జీతం పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుత పరిమితి నెలకు రూ. 15 వేలు కాగా... పెంచనున్న పరిమితి నెలకు రూ. 25 వేలు. ఈ మార్పు అమలైతే కోటి మందికి పైగా ఉద్యోగులు అదనంగా పీఎఫ్, పెన్షన్ సౌకర్యాల పరిధిలోకి వస్తారు.చివరిసారిగా జీతం పరిమితిని 2014లో మార్చారు. అప్పుడు రూ. 6,500 నుండి రూ.15 వేలకు పెంచారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రూ.15వేల వరకు బేసిక్ జీతం తీసుకునేవారు తప్పనిసరిగా పీఎఫ్ అకౌంట్ ఉండాలి. రూ.15వేల కంటే ఎక్కువ జీతం ఉంటే, పీఎఫ్ లో చేర్చుకోవాలా వద్దా అనేది కంపెనీ యాజమాన్యం ఇష్టంపై ఉంటుంది. దీనివల్ల ప్రైవేట్ ఉద్యోగుల్లో చాలా మందికి పదవీ విరమణ తర్వాత పెన్షన్ లేకుండా పోతోంది.
ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు మాట్లాడుతూ ఈ పరిస్థితి ఆందోళనగా ఉందని అన్నారు. ఎందుకంటే, రూ. 15 వేల కంటే కొంచెం ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు పెన్షన్ ఉండట్లేదు. అందుకే, పెరుగుతున్న ఖర్చులు, ప్రస్తుత ఆదాయాలకు తగ్గట్టుగా నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని ముంబైలో జరిగిన ఒక సమావేశంలో చెప్పారు.
ALSO READ : జొమాటోకు ప్రైవసీ దెబ్బ
సమాచారం ప్రకారం, ఈపీఎఫ్ఓ (EPFO) అధికారికంగా కొత్త పరిమితిని ప్రతిపాదించిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు (CBT) వచ్చే ఏడాదిలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.
ఉద్యోగులకు లాభాలు:
ఉద్యోగి, కంపెనీ పీఎఫ్ లో జమ చేసే డబ్బు పెరుగుతుంది. అలాగే పదవీ విరమణ సమయానికి ఎక్కువ పీఎఫ్ మొత్తం చేతికి వస్తుంది. భవిష్యత్తులో కూడా పెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా లక్షల మంది ఉద్యోగం చేసేవారికి ఆర్థిక భద్రత ఉంటుంది. ప్రస్తుతానికి ఉద్యోగి, కంపెనీ ప్రాథమిక జీతం (Basic Pay)లో 12% చొప్పున పీఎఫ్‌కు జమ చేస్తారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే గత పదేళ్లలో సామాజిక భద్రత (Social Security) విషయంలో జరిగిన అతి పెద్ద మార్పు ఇదే అవుతుంది.
