ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) కస్టమర్ల వ్యక్తిగత వివరాలను ముఖ్యంగా ఫోన్ నంబర్లను రెస్టారెంట్‌లతో షేర్ చేసుకోవాలని నిర్ణయం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పటివరకు జొమాటో, స్విగ్గీ యాప్‌లలో ఆర్డర్ చేసిన కస్టమర్ల వివరాలు రెస్టారెంట్‌లకు తెలిసేవి కావు. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) దీనిపై చాలా కాలంగా పోరాడుతోంది. కస్టమర్ల డేటా ఇస్తే, వారి అవసరాలను తెలుసుకోవడం, మార్కెటింగ్ చేయడం లేదా ఆర్డర్‌లో సమస్యలొస్తే నేరుగా కాల్ చేయడానికి ఈజీ అవుతుందని రెస్టారెంట్లు కోరుతున్నాయి.
కానీ జొమాటో ఒక పైలట్ కార్యక్రమంగా, కస్టమర్ల నుంచి అనుమతి (పాప్-అప్ ద్వారా) అడుగుతోంది. పాప్-అప్ ఒకే చేస్తే, వారి ఫోన్ నంబర్ రెస్టారెంట్‌లతో షేర్ అవుతుంది. అసలు సమస్య ఏమిటంటే, ఒకసారి అనుమతి లేదా ఒకే చేసాక.. సమాచారాన్ని తిరిగి ఉపసంహరించుకునే (Opt-Out) అవకాశం లేదు.
ఫోన్ నంబర్లు షేర్ చేయడం వల్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందని, స్పామ్ మెసేజెస్ పెరుగుతాయని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. రాజ్యసభ ఎంపీలు మిలింద్ దేవరా, ప్రియాంక చతుర్వేది వంటి వారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త DPDP (డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్) నియమాలకు విరుద్ధమని హెచ్చరించారు. పార్లమెంటులో దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జొమాటో సీఈఓ ఆదిత్య మంగ్లా స్పందిస్తూ, అనుమతి ఇస్తే కేవలం ఫోన్ నంబర్ మాత్రమే షేర్ చేస్తామని, మరే ఇతర వివరాలు ఇవ్వమని చెప్పారు. అయినప్పటికీ గోప్యతపై ఆందోళన కొనసాగుతోంది. సోషల్ మీడియా యూజర్లు దీని వల్ల స్పామ్ మెసేజులు డోర్స్ తెరుస్తుందని చెబుతున్నారు.
