న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) వ్యవస్థాపకుడు, బహుజన నేత కాన్షీరామ్‌కు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. కాన్షీరామ్‌కు మరణానంతరం భారతరత్న ప్రదానం చేయాలని లేఖలో కోరినట్లు రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. రాజకీయాల స్వరూపాన్నే మార్చిన గొప్పవ్యక్తి కాన్షీరామ్ అని కొనియాడారు. పేదలు, దళితులు, బహుజనుల కోసం ఆయన చేసిన పోరాటాలు మనందరికి స్ఫూర్తి అంటూ లేఖలో హైలైట్ చేశారు. కాన్షీరామ్ సామాజిక న్యాయం కోసం ఉద్యమించారని, బహుజనుల్లో చైతన్యాన్ని నింపారని గుర్తుచేశారు.
దళితుల చైతన్యం, సాధికారత కోసం జీవితకాలం అంకితభావంతో కృషి చేశారని, అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. కాన్షీరామ్‌కు భారత రత్న ఇవ్వడం.. ఆయన దేశానికి చేసిన సేవలకు దక్కే అసలైన గౌరవమని, ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షను నెరవేర్చినట్టు అవుతుందని వివరించారు. ఇటీవల లక్నోలో జరిగిన సామాజిక పరివర్తన్ దివస్ కార్యక్రమంలోనూ ఈ డిమాండ్ వినిపించిందని ఈ సందర్భంగా రాహుల్ గుర్తుచేశారు. రాహుల్ లేఖపై బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్‌కు భారత రత్న ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పుడు కాన్షీరామ్‌కు ఇవ్వాలని అడిగే అర్హత కాంగ్రెస్‌కు ఎక్కడిదని ఆమె నిలదీశారు. ‘‘అంబేద్కర్‌ను గౌరవించని కాంగ్రెస్.. ఇప్పుడు కాన్షీరామ్‌కు గౌరవం ఇస్తుందా?’’ అని ప్రశ్నించారు.
