- గ్యాస్ సంక్షోభం తీవ్రం.. హై అలర్ట్లో దేశాలు
- ధరల పెరుగుదలను నియంత్రించడమే టార్గెట్
- సబ్సిడీలు పెంచడం లేదా ట్యాక్స్ తగ్గించడానికి మొగ్గు
- గ్యాస్ ఉత్పత్తిని పెంచిన ఇండియా
- స్ట్రాటజిక్ రిజర్వ్‌ల నుంచి ఎరువులను విడుదల చేసిన చైనా
న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా యుద్ధంతో గ్లోబల్‌గా ఎనర్జీ సంక్షోభం నెలకొంది. హార్మూజ్ జలసంధి మూతపడడం, ఖతార్, సౌది అరేబియా, యూఏఈలోని లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ), లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) కేంద్రాలపై ఇరాన్ దాడులు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సప్లయ్‌లో అంతరాయం ఏర్పడింది. ఫెర్జిలైజర్స్, స్టీల్, కెమికల్స్ వంటి పరిశ్రమలకు కొరత ఏర్పడింది. గ్యాస్ సప్లయ్ తాత్కాలికంగా నిలిచిపోవడంతో చాలా దేశాల్లో పానిక్ బయ్యింగ్ పెరుగుతోంది.
ఇండియాలోనే చూసుకుంటే బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీలలో చాలా రెస్టారెంట్లు మూతపడ్డాయి. గ్యాస్ సప్లయ్‌ను కొనసాగించేందుకు ఉత్పత్తి పెంచడం వంటి చర్యలను ఇండియా తీసుకుంది. మన మాదిరే చాలా దేశాలు చర్యలు చేపట్టాయి. సబ్సిడీ ఇవ్వడమో లేదా ట్యాక్స్ తగ్గించడమో చేస్తున్నాయి. వివిధ దేశాలు తీసుకున్న ఎమర్జెన్సీ చర్యల వివరాలు కింద ఉన్నాయి.
దేశాల వారీగా..
ఇండియా
కేంద్ర ప్రభుత్వం కిందటి వారం ఎల్‌పీజీ గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని, కుకింగ్ గ్యాస్ కొరతను పరిష్కరించాలని రిఫైనరీలను ఆదేశించింది. దీంతో ప్రొడక్షన్ 25–30 శాతం పెరిగింది. పరిశ్రమలకు అమ్మకాలు తగ్గించి, ఎల్‌పీజీ కనెక్షన్స్ ఉన్న 33.30 కోట్ల గృహాలకు సరఫరా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగదారులను పానిక్ బాయింగ్ చేయవద్దని, సాధ్యమైన చోట పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ)కి మారాలని సూచించింది. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్న గృహాలు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌ను సర్‌రెండర్ చేయాలని తాజాగా ఆదేశించింది. ఇకపై వీరు ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉంచుకోవడం లేదా రీఫిల్ చేయించుకోవడం నిషేధం. పీఎన్‌జీ కనెక్షన్ ఉంటే డైరెక్ట్‌గా పైపుల ద్వారా వంట గ్యాస్ సప్లయ్ అవుతుంది. ప్రస్తుతం పెద్ద సిటీలలోనే ఈ సౌకర్యం ఉంది.
దక్షిణ కొరియా
బలహీన వర్గాలకు అదనపు ఎనర్జీ వోచర్లు ఇవ్వాలని పరిశీలిస్తోంది. విద్యుత్, గ్యాస్ బిల్లుల చెల్లింపులో ఈ వోచర్లను వాడుకోవచ్చు. దీంతో పాటు అణు, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు సిద్ధమవుతోంది.
యూరప్ దేశాలు
ఎల్‌ఎన్‌జీ సప్లయ్ ఆలస్యం కాకుండా చూసేందుకు గ్యాస్ దిగుమతులపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) నియమాలను సడలించాలని సభ్య దేశాలకు యూరోపియన్ కమిషన్ సూచించింది. నార్వే, నెదర్లాండ్స్ వంటి కొన్ని దేశాలు గ్యాస్ ఉత్పత్తిని పెంచుతున్నాయి. హీట్ పంప్‌లు, సోలార్, విండ్ ఎనర్జీని పెంచాలని, గ్యాస్‌పై ఆధారపడడాన్ని తగ్గించాలని ఈయూ నిర్ణయించింది. అంతేకాకుండా గృహాలు, పరిశ్రమలలో గ్యాస్ వినియోగం తగ్గించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తోంది.
ఇటలీ
ఇంధన ధరలు తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించే ఆలోచనలో ఉంది. ఎనర్జీ సంక్షోభాన్ని లాభాలు పెంచుకునేందుకు వాడుకుంటున్న కంపెనీలపై అదనపు పన్నులు వేయాలని నిర్ణయించింది.
మలేషియా
పెట్రోల్ సబ్సిడీలను 700 మిలియన్ రింగిట్ నుంచి 2 బిలియన్ రింగిట్ (510 మిలియన్ డాలర్ల) కి పెంచి, ధరలను స్థిరంగా ఉంచుతామని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పెట్రోల్ ధరలు పెరగకుండా చూస్తోంది.
ఫిలిప్పీన్స్ , బ్రెజిల్
ఎల్‌ఎన్‌జీ ధరలు పెరగడంతో కరెంట్ బిల్లులను కంట్రోల్లో ఉంచేందుకు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మరోవైపు బ్రెజిల్ డీజిల్‌పై ఉన్న ఫెడరల్ పన్నులను రద్దు చేసి, ధరలను నిలకడగా ఉంచాలని చూస్తోంది.
ఈజిప్ట్, ఇథియోపియా
ఈజిప్ట్ ప్రైవేట్ బేకరీల్లో అమ్మే సబ్సిడీ లేని బ్రెడ్‌పై గరిష్ట ధరలు విధించింది. ద్రవ్యోల్బణం నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఆహార నియంత్రణలను తిరిగి ప్రవేశపెట్టింది. ఇథియోపియా ఇంధన సబ్సిడీలను పెంచింది.
చైనా
గ్యాస్ కొరతతో ఎరువుల తయారీ నెమ్మదించింది. దీంతో సాగు అవసరాల కోసం ఎరువులను జాతీయ నిల్వల నుంచి చైనీస్ గవర్నమెంట్ విడుదల చేస్తోంది. యూరియా ఎగుమతులపై నియంత్రణలు పెట్టగా, ఫాస్పేట్ ఎగుమతులను నిలిపేసింది. యూరియాపై నియంత్రణలను సడలించాలని ఇండియా ఇప్పటికే చైనాను కోరింది.
ఆస్ట్రేలియా
మైనింగ్, వ్యవసాయ రంగాలకు ఇంధన కొరత తగ్గించేందుకు దేశీయ నిల్వల నుంచి పెట్రోల్, డీజిల్‌ను విడుదల చేస్తోంది. ఆస్ట్రేలియా దగ్గర ప్రస్తుతం సుమారు 36 రోజుల పెట్రోల్, 32 రోజుల డీజిల్ స్ట్రాటజిక్ రిజర్వ్‌లు ఉన్నాయి. యుద్ధం కారణంగా ప్రభుత్వం అత్యవసర నిల్వల నుంచి 6 రోజుల పెట్రోల్, 5 రోజుల డీజిల్ విడుదల చేసింది.
