‘సర్’పై అప్రమత్తంగా ఉండండి..పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ సూచన

‘సర్’పై అప్రమత్తంగా ఉండండి..పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ సూచన
  • కాంగ్రెస్ అనుకూల ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రచేస్తోందని హెచ్చరిక
  • సమర్థులైన పార్టీ కార్యకర్తలను బీఎల్ఏలుగా నియమించాలని సూచన
  • పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి జూమ్ మీటింగ్ లో దిశానిర్దేశం
  • మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ( సర్) ప్రక్రియ త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్  నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సూచించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలపై జూమ్ లో సమీక్ష నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి అరగంట చొప్పున టైం కేటాయించి ‘సర్’ తో పాటు ఇతర ముఖ్య అంశాలపై పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్  దిశానిర్దేశం చేశారు.

బెంగాల్  వంటి రాష్ట్రాల్లో ‘సర్’ పేరుతో పెద్ద మొత్తంలో సెక్యులర్  ఓట్లను తొలగించడంతో రాజకీయ సమీకరణలు ఏవిధంగా మారిపోయాయో వివరించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్  అనుకూల, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్రచేస్తోందని, అందువల్ల క్యాడర్​ అలర్ట్​గా ఉండాలని హెచ్చరించారు. అర్హులైన ఏ ఒక్కరినీ ఓటరు లిస్టులోంచి తొలగించకుండా చూసే బాధ్యత బూత్  లెవెల్  ఏజెంట్లు ( బీఎల్‌‌ఏ) తీసుకోవాలని సూచించారు. అందుకే బూత్ స్థాయిలో కాంగ్రెస్  తరపున సమర్థుడైన కార్యకర్తను బీఎల్‌‌ఏగా నియమించాలన్నారు.

మండల కమిటీలను వెంటనే నియమించాలి

అన్ని పార్లమెంట్  నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్  మండల కమిటీలను కూడా వెంటనే నియమించాలని మీనాక్షి, మహేశ్ గౌడ్  సూచించారు. ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలన్నారు. పాత, కొత్త నేతలకు అవకాశం కల్పించాలన్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానిక సమస్యలపై నేతలు స్పందించాలన్నారు. లోకల్  ఇష్యూలపై దృష్టిపెట్టి జనంతో కలిసి నడవాలని పేర్కొన్నారు.

‘‘ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలి. ఇదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, వాటిని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా పార్టీ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలి” అని దిశానిర్దేశం చేశారు. కాగా.. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్  పదవుల్లో సీనియర్లను కాదని జూనియర్లకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు మీనాక్షి, మహేశ్ గౌడ్  దృష్టికి తీసుకువచ్చారు.

మండల కమిటీలో పార్టీ పదవి ఇవ్వాలంటేనే వరుసగా మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ లో ఉండాలనే నిబంధన పెట్టిన నాయకత్వం, ఇతర పార్టీల నుంచి అప్పుడే చేరిన వారికి నామినేటెడ్  పదవులు ఎలా ఇచ్చారని కరీంనగర్ కు చెందిన కొందరు నేతలు ప్రశ్నించారు. దీనిపై వారు స్పందిస్తూ ఇకపై అలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.