సర్ తేదీ.. 1987 జులై 1 అంతకుముందు జన్మిస్తే ఏదైనా ఒక గుర్తింపు పత్రం చూపిస్తే చాలు.. 1987 తర్వాత పుడితే

సర్ తేదీ..  1987 జులై 1 అంతకుముందు జన్మిస్తే ఏదైనా ఒక గుర్తింపు పత్రం చూపిస్తే చాలు.. 1987 తర్వాత పుడితే
  • 1987 తర్వాత పుడితే దరఖాస్తుదారులతో పాటు తల్లితండ్రుల్లో ఒకరి వివరాలు
  • 2004 దాటితే పెరేంట్స్ బర్త్ లేదా 
  • ప్లేస్​ ఆఫ్​ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే
  • బీఎల్వోలు ప్రతి ఇంటిని కనీసం 
  • మూడు సార్లు సందర్శించాలి
  • మీడియాతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్​’(సర్) లక్ష్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. సర్ లో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, లింకింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసం పుట్టిన తేదీ ఆధారంగా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా జులై 1, 1987 కంటే ముందు భారతదేశంలో జన్మించిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి తమ పుట్టిన తేదీ లేదా నివాస ధృవీకరణ కోసం ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ చూపితే సరిపోతుందని స్పష్టం చేశారు. 

అయితే, జులై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య కాలంలో జన్మించిన దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత పత్రాలతో పాటు, తల్లి లేదా తండ్రిలో ఒకరి వివరాలు లేదా ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారైతే, తమ సొంత పత్రాలతో పాటు అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరి బర్త్ (జనన) లేదా ప్లేస్ ఆఫ్ బర్త్ (పుట్టిన స్థలం) సర్టిఫికెట్లను కచ్చితంగా జతచేయాల్సి ఉంటుందని సీఈఓ వివరించారు. ఈ వయస్సు ధ్రువీకరణ నమోదు ప్రక్రియ కోసం పాస్‌‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, విద్యాసంస్థల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ సహా మొత్తం 12 రకాల పత్రాలను ఎన్నికల సంఘం ప్రామాణికంగా తీసుకోనుందని తెలిపారు. బీఆర్కే భవన్​లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈవో సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.

  • జూన్ 25 నుంచి నెల పాటు బీఎల్వోల క్షేత్రస్థాయి పరిశీలన

ఈ సర్ షెడ్యూల్ ప్రకారం, జూన్ 25 నుంచి జులై 24 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరించే భారీ సర్వే నిర్వహిస్తారన్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు తప్పనిసరిగా సందర్శిస్తారని, ముందస్తుగా ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు స్వయంగా అందించి వివరాలను సేకరిస్తారని సీఈవో తెలిపారు. 

ఈ విధంగా సేకరించిన పూర్తి వివరాల ఆధారంగా జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారని తెలిపారు. ఈ ముసాయిదా జాబితాపై ఓటర్లు తమ అభ్యంతరాలను, కొత్త క్లెయిమ్‌‌లను జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించారన్నారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, అవసరమైన సవరణలు పూర్తి చేసిన అనంతరం అక్టోబర్ 1, 2026న రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని సుదర్శన్ రెడ్డి వివరించారు.

  • 35,985 మంది బీఎల్వోలు, 3,596 మంది సూపర్​వైజర్లు

ఈ భారీ కసరత్తును పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం పనిచేస్తుందని సీఈవో తెలిపారు. ఈ ప్రక్రియ అంతా 33 మంది జిల్లా ఎన్నికల అధికారులు, 119 మంది ఈఆర్వోలు, 867 మంది ఏఈఆర్వోల నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో నేరుగా ఓటర్లను కలవడానికి 35,985 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), వారి పనితీరును పర్యవేక్షించడానికి 3,596 మంది సూపర్‌‌వైజర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,927 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా, అందులో 14,750 పోలింగ్ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో.. 21,157 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సవరణ ప్రక్రియ ద్వారా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న 64.38 శాతం ఓటర్ మ్యాపింగ్‌‌ను మరింత పెంచి, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈవో పేర్కొన్నారు.

ఆన్‌‌లైన్ దరఖాస్తుకు ఈసీఐ వెబ్‌‌సైట్ సదుపాయం

కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునే అర్హులైన పౌరులు ఫారమ్-6తో పాటు తగిన ధృవీకరణ పత్రాలను అందజేయాలని, ఓటర్లు కార్యాలయాలకు నేరుగా రాకుండా ఈసీఐ అధికారిక వెబ్‌‌సైట్ (https://voters.eci.gov.in) ద్వారా సులభంగా ఆన్‌‌లైన్‌‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. 

ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవడానికి 1950 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందని, అవసరమైతే వెబ్‌‌సైట్ ద్వారా ‘బుక్ ఏ కాల్’ సదుపాయాన్ని వాడుకుని అధికారుల సహాయం పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఓటర్ల తాజా గణాంకాలను పరిశీలిస్తే, మొత్తం 3.39 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుష ఓటర్లు 1.68 కోట్లుగాను, మహిళా ఓటర్లు 1.71 కోట్లుగానూ ఉన్నారని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.