పార్టీ కోసం కష్టపడ్డా.. మంత్రి పదవి ఇవ్వండి : ఎమ్మెల్యే రామ్మోహన్‌‌ రెడ్డి

పార్టీ కోసం కష్టపడ్డా.. మంత్రి పదవి ఇవ్వండి : ఎమ్మెల్యే రామ్మోహన్‌‌ రెడ్డి
  • రాహుల్ గాంధీకి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌‌రెడ్డి విన్నపం
  • ఢిల్లీలో కలిసి వినతి పత్రం 

హైదరాబాద్, వెలుగు: కేబినెట్​విస్తరణలో  తనకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌‌ రెడ్డి కోరారు. శనివారం ఢిల్లీలో రాహుల్‌‌ను కలిసిన ఆయన.. ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రామ్మోహన్‌‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌‌లో మూడు ఖాళీలున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి లేదు. గతంలో ఈ జిల్లా నుంచి ముగ్గురు నుంచి ఆరుగురు మంత్రులుగా ఉండేవారు. ఇప్పుడు ఒక్కరు కూడా లేకపోవడంతో జిల్లాకు అన్యాయం జరుగుతోంది. భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే జిల్లాలో 44 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో పార్టీకి మరిన్ని సీట్లు రావాలంటే రంగారెడ్డి నుంచి మంత్రి ప్రాతినిథ్యం ఉండాలి” అని పేర్కొన్నారు. 

పార్టీ కోసం మూడు తరాలుగా.

కాంగ్రెస్ పార్టీ కోసం తాము మూడు తరాలుగా పనిచేస్తున్నట్టు రామ్మోహన్‌‌రెడ్డి తెలిపారు. ‘‘మేం మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం. నేను 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేశా. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా బూత్‌‌స్థాయి నుంచి కష్టపడి పనిచేశా. నా కష్టాన్ని గుర్తించి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరాను. ఆయన సానుకూలంగా స్పందించి, పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. నా పేరును రాహుల్ గాంధీకి సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించి.. అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ కూడా నన్ను గుర్తించి మంత్రి పదవి వచ్చేలా సహకరిస్తారని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.