డీలర్ల ఇండెంట్లకు తగ్గట్లుపెట్రోల్ సరఫరా చేయాలి : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్

డీలర్ల ఇండెంట్లకు తగ్గట్లుపెట్రోల్ సరఫరా చేయాలి : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
  • తెలంగాణ పెట్రోలియం డీలర్స్​ అసోసియేషన్​ డిమాండ్

హైదరాబాద్​సిటీ,వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గత మూడు వారాలుగా చాలా జిల్లాల్లో డీలర్లు ఇచ్చే ఇండెంట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్  సరఫరా కావడం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్​ అసోసియేషన్​ ఆందోళన వ్యక్తం చేసింది. డీలర్ల అవసరాలకు అనుగుణంగా తక్షణమే ఇంధన సరఫరాను పునరుద్దరించాలని అసోసియేషన్​ అధ్యక్షుడు మర్రి అమరేందర్​రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పెట్రోలియం మంత్రిత్వశాఖ, ఆయిల్​ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.

దేశానికి సేవలందిస్తున్న లక్షకుపైగా రిటైల్​ ఔట్ లెట్ల కొనసాగింపు కోసం డీలర్ల పెరిగిన మూలధన అవసరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఆయిల్​ కంపెనీలు కూడా డీలర్ల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని క్రెడిట్​ సౌకర్యాన్ని కొనసాగించాలన్నారు. పెట్రోల్, డీజిల్​ ధరల  పెరుగుదలతో డీలర్లు అదే స్థాయిలో రోజువారీ నిల్వలను కొనసాగించడానికి చిన్న, మధ్య తరగతి ఔట్​లెట్లపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నారని తెలిపారు.