ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఇయ్యాల్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఇయ్యాల్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
  • ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణ పనులకు ఆటకం కలగకుండా ఆదివారం నుంచి ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట వెళ్లే ప్రయాణికులు నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాప్ నుంచి బస్సులు ఎక్కాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు మెహఫిల్ హోటల్ పక్క నుంచి ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ద్వారా నాగోల్ వెళ్లి, ఫ్లైఓవర్ కింద యూ-టర్న్ తీసుకోవాలి. 

హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్ పక్క నుంచి బీరప్పగడ్డ మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాలి. ఉప్పల్ భగాయత్ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల వరంగల్ వైపు నుంచి నగరంలోకి వచ్చే ప్రైవేటు భారీ వాహనాలు ఘట్​కేసర్ ఓఆర్ఆర్​పై హయత్​నగర్ మీదుగా రావాల్సి ఉంటుంది. అయితే, గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు చేసి సరిగా అమలు చేయకపోవడంతో, ఈసారైనా ఈ ఆంక్షలు పక్కాగా అమలువుతాయా లేదా అని వాహనదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.