- రెవెన్యూ, ఫారెస్ట్ భూవివాదాలకు జాయింట్ సర్వేతో శాశ్వత పరిష్కారం
- ఈ నెలాఖరులోగా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువల సవరణ
- ఓఆర్ఆర్ లోపల ఎకరాకు రూ.15 లక్షలు మార్కెట్ వ్యాల్యూ ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులు ఇంకా విడుదల కాలేదని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్ర నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. శనివారం తన చాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి సుమారు రూ.1.13 లక్షల వాటా రావాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతోనే ఇందిరమ్మ లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు ఆపినట్లు వివరించారు.
ఇప్పటివరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదన్నారు. ఈ నిధుల విడుదల కోసం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తాను కూడా పలుమార్లు ప్రయత్నించినట్లు చెప్పారు. ఒకవేళ కేంద్రం మరో 15 నుంచి 20 రోజుల్లోగా ఆ నిధులను విడుదల చేయకపోతే, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరించి నిధులు అందజేస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల చివరినాటికి భూముల విలువలను సవరించి అమల్లోకి తీసుకువస్తామని ఓఆర్ఆర్ లోపల ఎకరాకు కనీసం రూ.15 లక్షల మార్కెట్ వాల్యూ ఉంటుందన్నారు.
- రూ.14.08 కోట్లతో కొత్త సాఫ్ట్‌వేర్
రెవెన్యూ, అటవీ భూముల మధ్య కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపబోతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈసారి ప్రత్యేకంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎఫ్‌ఓలను సమావేశపరిచి రోవర్ల సాయంతో సరిహద్దుల గుర్తింపుపై అవగాహన కల్పించామన్నారు. సరిహద్దులను కచ్చితంగా ఖరారు చేయాలని ఆదేశించామని, 1/70 సమస్యపై కూడా చర్చించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సమగ్ర సర్వే కార్యక్రమం చేపడతామన్నారు.
రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వర్లు డౌన్ అవుతున్న అంశంపై దృష్టి సారించామని, కొత్త సాఫ్ట్‌వేర్ ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇండ్లను పాత రేట్లకే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరామన్నారు. పలు ప్రాంతాల్లో పదికి పైగా ఇండ్లు కలిగిన టవర్లను గుర్తించి వాటికి పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
- అన్నదమ్ములకు వన్ ప్లస్ వన్
గత ప్రభుత్వం ఎన్నికల ముందు సుమారు 38 వేల ఇండ్లకు లబ్ధిదారులను ఖరారు చేసిందని, అయితే తాము ఏడాది పాటు సైంటిఫిక్ సర్వే నిర్వహించగా వారిలో సుమారు 16 వేల మంది అసలు ఆ ఇండ్లలో దిగలేదని తేలిందని మంత్రి చెప్పారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటూ రోజూ సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించలేని పేదలకు, వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్లను కేటాయించాలని నిర్ణయించామన్నారు.
అర్హులను ఎంపిక చేసి యుద్ధప్రాతిపదికన కేటాయింపులు జరిపి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో పేదలకు ఇండ్ల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకే స్థలంలో అన్నదమ్ములు ఇందిరమ్మ ఇండ్లను ‘వన్ ప్లస్ వన్’ పద్ధతిలో (పై అంతస్తు) కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
- అమ్మిన భూములు ఆన్లైన్ లో రావడంపై విచారణ
గతంలో ప్రైవేటు భూములను సేకరించి ఇండ్ల నిర్మాణానికి లేఅవుట్‌లు వేశారని.. వాటిలో కొన్ని ఖాళీగా ఉండగా, మరికొన్ని చోట్ల కబ్జాకు గురయ్యాయని చెప్పారు. ధరణి కారణంగా గతంలో భూమి అమ్మిన వ్యక్తి పేరిటే మళ్లీ సదరు భూమి ఉన్నట్లు రావడంతో సమస్యలు మొదలయ్యాయన్నారు. ఇటువంటి అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామని, కబ్జాదారులను, ప్రభుత్వ భూమిని వదిలే ప్రసక్తే లేదని, అవసరమైన చోట ప్రభుత్వ భూములకు ప్రహారీ గోడలతో రక్షణ కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
- ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్
పాలేరు నియోజకవర్గాన్ని 20 వేల ఓటర్ల చొప్పున 14 క్లస్టర్‌లుగా విభజించి ఇప్పటి వరకు 13 ప్రాంతాలలో ప్రజా దర్బార్ నిర్వహించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా 52 శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఉన్నాయన్నారు. సెకండ్ హయ్యెస్ట్ భూముల ఇబ్బందులు, సాదాబైనామాల అంశాలు 17 శాతం వచ్చాయని, ఆసరా పెన్షన్లు 13 శాతం, 2.5 శాతం గృహ జ్యోతి, 1-2 శాతం గ్యాస్ సబ్సిడీ, కొత్త రేషన్ కార్డులు 8 శాతం-,ఆరోగ్య విద్య అంశాలు 10 శాతం ఉన్నాయన్నారు.
