- 12 మంది నిందితుల అరెస్ట్
కరీంనగర్, వెలుగు: సైబర్ మోసాల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సృష్టించి సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారితో సహా 12 మందిని కరీంనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఈమేరకు వివరాలు వెల్లడించారు. కరీంనగర్ భగత్‌నగర్‌కు చెందిన అరముదుగుంటి రాజేశ్వర్ రెడ్డి ప్రధాన సూత్రధారుగా పోలీసులు గుర్తించారు. అతడికి మరో 11 మంది సహకరించారు. వీరంతా కరీంనగర్ లో అమాయకులను గుర్తించి స్వయంగా వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, కరెంట్ అకౌంట్లను తెరిచేవారు.
ఆ అకౌంట్ల కు సంబంధించిన పాస్‌బుక్స్, ఏటీఎం కార్డులు, అకౌంట్‌కు లింక్ చేసిన సెల్ నంబర్ సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లకు అమ్మేవారు. ఇలా జిల్లాలోని నాలుగు ప్రధాన బ్యాంకుల్లో సైబర్ నేరగాళ్లు 34 మ్యూల్ అకౌంట్లను ఉపయోగిస్తున్నట్లు కమిషనరేట్ పోలీసులు ఈ నెల మొదటి వారంలో గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు సుమారు వెయ్యికి పైగా లావాదేవీలు జరిపి రూ.2.91 కోట్ల వరకు డబ్బు జమ చేశారు. ఈ ఘటనలకు సంబంధించి 20 కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల్లో ప్రధాన సూత్రదారి రాజేశ్వర్ రెడ్డితోపాటు అతడికి సహకరించిన కరీంనగర్ వాసులు నందగిరి సాయి వర్ధన్, కాలిదాస్ కౌశిక్, ములంకుల రాజ్‌కుమార్, బండి సాయి కృష్ణ, అడవెల్లి సాయి కార్తిక్, మీర్ జామీ ఉద్దీన్, మహమ్మద్ జవాద్ ఖాన్, సర్దార్ దల్జీత్ సింగ్, పల్లెర్ల అజయ్, నిర్మల్ల శివ, దిడ్డి సాయి చరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కీలక పత్రాలు, బ్యాంక్ కిట్లు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వీటిపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని సీపీ గౌస్ ఆలం తెలిపారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డి, ఎస్‌ఐలు శ్రీనాథ్, పోచయ్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ అనిల్, కానిస్టేబుళ్లను ఈ సందర్భంగా సీపీ అభినందించారు.
